దానివల్ల మేము నష్టపోతున్నాం.. మత్స్యకారుల ఆవేదన.. పట్టించుకోని అధికార ప్రభుత్వం

by Disha Web Desk 3 |
దానివల్ల మేము నష్టపోతున్నాం.. మత్స్యకారుల ఆవేదన.. పట్టించుకోని అధికార ప్రభుత్వం
X

దిశ వెబ్ డెస్క్: ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మనం మందులు వేసుకుంటాం. అయితే ఆ మందులను తాయారు చేసే సమయంలో కొన్ని వ్యర్ధాలు విడుదల అవుతాయి. ఆ వ్యర్ధాలను ఆ కంపెనీలోనే సాంకేతిక పద్దతుల ద్వారా భూమిలోకి పంపించాలి. అయితే అలా చెయ్యడానికి అధిక ఖర్చు అవుతుంది. అందుకు కొన్ని ఫార్మా కంపెనీలు చట్టవిరుద్ధంగా ఆ వ్యర్ధాలను దగ్గరలోని కాలువలు, నదులు, సముద్రాలలోకి వెళ్లేలా ఏర్పాటు చేస్తారు.

దీని వల్ల జల కాలుష్యం ఏర్పడి జలచరాలు ప్రాణాలను కోల్పోతాయి. ఈ విషయం తెలిసి కూడ కొన్ని ఫార్మా కంపెనీలు వ్యర్ధాలను నీటిలోకి వదులుతున్నాయి. ఈ కోవలోకే ప్రముఖ కంపెనీ అరవిందో కూడా వస్తోంది. కాకినాడ జిల్లా లోని కోనపాపపేటలో ఉన్న అరబిందో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆ ఫ్యాక్టరీలో విడుదల అయ్యే వ్యర్ధాలను సమీప సముద్రంలోకి పైపులైన్ల ద్వారా విడుదల చేస్తోంది.

కాగా ఆ వ్యర్ధాల కారణంగా సముద్రంలోని చేపలు చనిపోతున్నాయి. దీనితో ఆ సముద్రం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వెంటనే ఆ పైపులైన్లను తొలిగించాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. అలానే ఈ నెల 11వ తేదీన విలేకర్ల సమావేశంలో తమ సమస్యను విన్నవించుకున్నారు.

అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందా అని మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మరోసారి మీడియాతో మాట్లాడిన మత్స్యకారులు సంచలన వ్యాఖ్యలు చేసారు. దాదాపు రెండు నెలల నుండి ఫిర్యాదు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఏపీ పాలకపక్షం, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఫాక్టరీలకు అనుమతులు ఇచ్చి తమ జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సముద్రంలోకి పైపులైన్ల ద్వారా వ్యర్ధాలను విడుదల చేయడం కారణంగా చేపల సంఖ్య తగ్గిపోతుందని.. అలానే లక్షల విలువ చేసే తమ వలలు దెబ్బతింటున్నాయి తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సాయంత్రం 4 గంటల వరకు చూస్తామని.. అప్పటికీ పైపులైన్లను తొలిగించకపోతే తామే తొలిగిస్తామని హెచ్చరించారు.

అలానే తమ సమస్యను పరిష్కరించని నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తాము ఓట్లు వెయ్యమని.. ఇప్పటికే అందరి ఆధార్, ఓటర్ ఐడి కార్డులు సేకరించామని.. వాటిని కలెక్టర్ కి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అల్టిమేట్ జారీ చేశారు.




Next Story

Most Viewed