Eugia Steriles Company: అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి

by Disha Web Desk 16 |
Eugia Steriles Company: అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి
X

దిశ, అనకాపల్లి: పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఇగియా స్టెర్లెస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి చెందాడు. గుండె నొప్పి అని యాజమాన్యం... విష రసాయనాలు లీకై కార్మికుడు మృతి చెందాడని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. ఎస్ రాయవరం మండలం బంగారయ్యపాలెం గ్రామానికి చెందిన ఉమ్మిడి వెంకటేష్(32) ప్రొడక్షన్ బ్లాక్లో ఉదయం విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా అకస్మారక స్థితికి చేరుకోవడంతో యాజమాన్యం గాజువాక కిమ్స్ ఐకాన్‌కి తరలించారు. అక్కడ కార్మికుడు మృతి చెందాడని యాజమాన్యం తెలిపింది.

కార్మికుడి మృతిపై భిన్న అభిప్రాయాలు

అయితే కార్మికుడి మృతిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇగియ ఫార్మా కంపెనీ ఇటీవల ప్రొడక్షన్ ప్రారంభించింది. ట్రైల్ రన్ నిర్వహిస్తుంది. ప్రొడక్షన్ బ్లాక్లో టెక్నికల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ (32) ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. అప్పటికి ప్రొడక్షన్ బ్లాక్లో అతను ఒక్కడే ఉండడం అస్వస్థకు గురవడం కారణంగా విష వాయువులు లీకై ఉంటాయని అనుమానం వ్యక్తం అవుతుంది. ప్రమాదం ఉదయం 11 :30 ప్రాంతంలో జరిగితే మధ్యాహ్నం 3 గంటల వరకు స్థానిక పోలీసులకు గాని, మృతుని బంధువులకు కానీ సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటించడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. యాజమాన్యం మాత్రం కార్మికుడికి ఛాతీలో నొప్పి రావడం వలన హాస్పిటల్‌కు తరలించామని, అక్కడ మృతి చెందాడని బహుశా గుండు నొప్పు వచ్చి ఉంటుందని నమ్మబలుతుంది.

మృతుడి బంధువుల ఆందోళన

విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు ఐకాన్ హాస్పిటల్ వద్దకు చేరుకొని యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఇది ఇలా ఉంటే కార్మికుడు విషవాయువుల లీకై చనిపోయాడని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. కర్మాగారం వద్దకు చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే యాజమాన్యం సహకరించలేదని గనిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుడు మృతిపై సమగ్ర విచారణ జరపాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ. 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.



Next Story