Ayyannapatrudu: ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు..

by Disha Web Desk 16 |
Ayyannapatrudu: ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు..
X
  • వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న వీసీని రీకాల్ చేయాలి
  • ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను వీసీ ఉల్లంఘించినా చర్యలు శూన్యం

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రా యూనివర్సిటీకి ఎంతో ఘన చరిత్ర ఉందని అలాంటి వర్సిటీకి చాలా మంది ప్రముఖులు వీసీలుగా పని చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏయూ పరువు దిగజారిపోయిందన్నారు. ఏయూను వైసీపీ కార్యాలయంగా మార్చేశారని ఆరోపించారు. వీసీ ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ప్రైవేట్ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేసి ఓట్లు వేయకపోతే విద్యాసంస్థలు మూసివేయిస్తామని వీసీ బెదిరించడం ఎమ్మెల్సీ కోడ్‌ను యథేచ్ఛగా ఉల్లంఘించడమేనని చెప్పారు. వైసీపీ నేతల బర్త్ డేలకు వీసీ కేక్ కట్ చేయలేదా అని ప్రశ్నించారు.

అది వాస్తవం కాదా..

ఈ నెల 12న ఏయూలో గంజాయి ప్యాకెట్లు దొరికింది వాస్తవం కాదా అని నిలదీశారు. జీవీఎంసీ ఎన్నికల్లో ఏయూ నుంచే ప్రసాద్ రెడ్డి ఓటర్లకు డబ్బులు పంచారని అయ్యన్న పాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. వీసీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఫేక్ ఓట్లు నమోదు అయ్యాయని, వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. యూనివర్శిటీలో జరిగే అక్రమాలపై మాట్లాడితే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. ఇలా బెదిరింపు కాల్స్ చేయడానికి ఒక బ్యాచ్‌ను ఏర్పాటు చేశారని..అక్రమాలకు పాల్పడుతున్న వీసీ ప్రసాద్ రెడ్డిని రీ కాల్ చేయాలని అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed