Ap Capital: మరింత హీట్ పెంచిన కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు.. అమరావతి రాజధాని కాదా?

by Disha Web Desk 16 |
Ap Capital: మరింత హీట్ పెంచిన కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు..  అమరావతి రాజధాని కాదా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై రాష్ట్రంలో ఇంకా రాజకీయ చర్చ జరుగుతూనే ఉంది. ఒకవైపు ఈ అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. అయినప్పటికీ వైసీపీ నేతలు మాత్రం విశాఖయే పరిపాలన రాజధాని అని చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశాఖయే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ప్రకటిస్తు్న్నారు. వైసీపీ మినహా అన్ని పార్టీలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నాయి. అటు కేంద్రంలోని బీజేపీ సైతం అమరావతికే జై కొడుతుంది. రాజధాని అంశం ఆయా రాష్ట్రాల ప్రభుత్వ నిర్ణయమంటూ బంతి వైసీపీ కోర్టులోకి నెట్టేసింది. అయితే అకస్మాత్తుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విశాఖ రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత హీట్ పుట్టిస్తోంది. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమానికి హాజరయ్యేందుకు విశాఖపట్నంలో పర్యటించిన ఆయన బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రలు ఎమ్మెల్సీ బరిలో నిలిచిన తమ పార్టీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్‌ను మరోసారి గెలిపించాలని కోరుతూ విశాఖ రాజధాని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

టంగ్ స్లిప్ అయ్యారా?

విశాఖపట్నం అభివృద్ది చెందుతున్న నగరం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతానికి చాలా కొత్త పరిశ్రమలు వస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నం రాజధాని ప్రాంతంలో మాధవ్‌‌లాంటి వ్యక్తి ఉన్నట్టయితే ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే విశాఖను రాజధాని అనడాన్ని చూస్తుంటే కిషన్ రెడ్డి టంగ్ స్లిప్ అయ్యారా లేకపోతే కేంద్రం మాటను బయటపెట్టారా అన్న చర్చ మెుదలైంది. అటు కేంద్రంలోని బీజేపీ అమరావతియే రాజధాని అని చెప్తోంది. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీ హాజరైన విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తమకు మద్దతు ఉంటుందని అటు అమరావతి రైతులు, ఇతర పార్టీలు భావిస్తున్నాయి. ఇంతలో కిషన్ రెడ్డి ఒక్కసారిగా విశాఖ రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ అమరావతి వైపే మెుగ్గు చూపుస్తోంది. అమరావతి రైతులు చేపట్టిన నిరసనలకు ప్రత్యక్షంగా మద్దతు సైతం తెలిపింది. తాజాగా కిషన్ రెడ్డి విశాఖ రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలతో ద్వంద్వ నీతిని బీజేపీ ప్రదర్శిస్తోందా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. కుటుంబ పార్టీల మధ్య ఘర్షణతో రాష్ట్ర అభివృద్ధి కుంటిపడుతుందని ఫలితంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే అజెండా కావాలని, కక్ష సాధింపు చర్యలతో ఏం సాధించలేరని కిషన్ రెడ్డి హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఒక్క బీజేపీతో మాత్రమే సాధ్యమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. అయితే కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు, బురదజల్లే ప్రయత్నాలు చేయడం సరికాదని సూచించారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ సహకరిస్తున్నారని, రాష్ట్రానికి చాలా విద్యా, పరిశోధనా సంస్థలు వచ్చాయని వెల్లడించారు. పర్యాటక అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని వెల్లడించారు. హైదరాబాద్‌లో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.



Next Story

Most Viewed