AP Politics: వాల్తేరు క్లబ్‌ను లాక్కొంటాం.. విశాఖ వైసీపీలో విజయసాయి చిచ్చు

by Disha Web Desk 3 |
AP Politics: వాల్తేరు క్లబ్‌ను లాక్కొంటాం.. విశాఖ వైసీపీలో విజయసాయి చిచ్చు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: తాజాగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2014 లో వైఎస్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటిగా వైసీపీ భావించే వాల్తేరు క్లబ్‌ను స్వాధీనం చేసుకొంటామని విజయసాయి రెడ్డి అనడం వివాదానికి దారితీసింది.

అలానే కొందరు ఉత్తరాంధ్ర నేతలు తనపై దుష్ప్రచారం చేసి విశాఖ నుంచి వెళ్లిపోయిట్లు చేశారని ఉత్తరాంధ్ర మాజీ సమన్వయకర్త అయిన విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వేల కోట్ల భూకబ్జాదారుడిననే ఆరోపణలు విశాఖలో చేశారని, తనకు ఒక అపార్ట్‌మెంట్ తప్ప వేరే ఆస్తులేమీ విశాఖలో లేవని విజయసాయి చెప్పుకొచ్చారు.

అయితే విజయసాయి సమన్వయకర్తగా వుండగా, ఆయన వ్యతిరేక వర్గానికి బొత్స నేతృత్వం వహించారు. దీనితో ఇవన్నీ పరోక్షంగా బొత్సకు తగిలాయి. అసలే ఎన్నికల సమయం, పైగా వైసీపీ తరుపున విశాఖ ఎంపీగా బరిలో బొత్స భార్య ఝాన్సీ ఉన్నారు. దీనితో బొత్స సత్యనారాయణ వెంటనే రంగంలోకి దిగి విశాఖకు సంబంధించి విజయసాయి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

ఇక 2014 ఎన్నికలలో విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు మద్దతుగా వచ్చిన జగన్ స్నేహితుడు చిన్న లుంగీలతో క్లబ్‌లో తిరిగారు. కాగా అలా లుంగీ ధరించి క్లబ్‌కు రావడం క్లబ్ నిబంధనలకు విరుద్ధం అంటూ క్లబ్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవకు దారి తీసింది. ఇక రాయలసీమ పంచెల బ్యాచ్ ఎన్నికలకు ముందే వాల్తేరు క్లబ్‌లో దౌర్జన్యాలకు, బెదిరింపులకు దిగారనే ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది.

చివరికి ఈ ప్రచారం విజయమ్మ ఓటమి కారణాలలో ఒకటైంది. దీనితో వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, దశాబ్ధాల చరిత్ర కలిగిన వాల్తేరు క్లబ్‌ను లాక్కొనే ప్రయత్నాలు జరిగాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులను పదేపదే పంపి క్లబ్ యాజమాన్యాన్ని వేధించారు. ఇప్పుడు అదే సీటుకు ఝాన్సీ పోటీ చేస్తున్నారు.

దీంతో విజయసాయి నెల్లూరు నుంచి వ్యూహాత్మకంగానే తాము అధికారంలోకి వస్తే క్లబ్‌ను స్వాధీనం చేసుకొంటామని ప్రకటించారని అందరూ అనుకుంటున్నారు. నగరంలోని, ఉత్తరాంధ్రా ప్రాంతంలోని ప్రముఖులు, పెద్దవారంతా ఆ క్లబ్‌లో సభ్యులుగా ఉన్నారు. అటువంటి దానిని వివాదంలోకి లాగి బొత్స ఝాన్సీకి వ్యతిరేకంగా వారి మనస్సు మార్చాలనే ఉద్దేశంతోనే విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ నేపథ్యంలో విజయసాయి వ్యాఖ్యలు ఎక్కడ తమ విజయావకాశాలను దెబ్బతీస్తాయో అని భావించిన బొత్స సత్యనారాయణ వెంటనే రంగంలోకి దిగారు. విలేకరుల సమావేశంలో , మీడియా ఇంటర్య్యూలలో విజయసాయి వ్యాఖ్యలను బొత్స తప్పుపట్టారు. ఏదైనా వుంటే నాయకుడు జగన్‌‌తో మాట్లాడు కోవాలి కానీ బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ విజయసాయిపై మండిపడ్డారు.

అసలు వాల్తేరు క్లబ్ వ్యవహారం ఇప్పుడు ఏం అవసరం అని ప్రశ్నించారు. తాను వుండగా, జగన్ అధికారంలో వుండగా వాల్తేరు క్లబ్‌కు ఏమీ కాదని, వాల్తేరు క్లబ్ సభ్యులైన నగరంలోని పెద్దల గౌరవం తగ్గకుండా తాను చూస్తానని హామీ ఇచ్చారు.‘‘ విశాఖలో వాల్తేరు క్లబ్ తాను పుట్టకముందు నుంచి , బ్రిటీష్ వారి కాలం నుంచి ఉందని.. అది ఓ కమ్యూనిటీ ఆధిపత్యంలో ఉందనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందులో కమ్మ, రెడ్డి, క్షత్రియ, కాపు, వెలమ, యాదవ, గవరలతో పాటు అందరూ ఉన్నారని పేర్కొన్నారు. సీఎంగా జగన్ ఉన్నంతవరకు క్లబ్‌కు ఏమీ కాదు. రక్షణ కల్పిస్తాం’’ అని బొత్స స్పష్టం చేశారు.


Next Story

Most Viewed