నాగబాబు సీటు చేంజ్.. ఈ సారి పోటీ ఆ పార్లమెంట్ స్థానం నుండే..?

by Disha Web Desk 19 |
నాగబాబు సీటు చేంజ్.. ఈ సారి పోటీ ఆ పార్లమెంట్ స్థానం నుండే..?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం–జనసేన తొలి ఉమ్మడి జాబితా వెల్లడి కావడంతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. జనసేన పోటీ చేసే మూడు లోక్ సభ స్థానాల్లో అనకాపల్లి కూడా ఉందనే వార్తలు రావడంతో ఇంతకాలం ఆ సీటుపై ఆశలు పెట్టుకొన్న పారిశ్రామిక వేత్త బైరా దిలీప్ చక్రవర్తి ఇప్పుడు చోడవరం అసెంబ్లీపై దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం- జనసేనల పొత్తు నేపథ్యంలో ఏదో పార్టీ నుంచి అనకాపల్లి లోక్‌సభకు పోటీ చేసేందుకు ఆయన గత ఆరు నెలలుగా నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్‌కు, ఇటు నారా లోకేష్‌కు సన్నిహితంగా మెలుగుతూ కార్యక్రమాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓటమి చెందిన ఆయన కాపు సామాజిక వర్గానికి అనకాపల్లి అనుకూలం అనే అంచనాలతో ఇక్కడ పని ప్రారంభించారు.

నాగబాబు రాకతో మారిన లెక్కలు

పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అనకాపల్లి లోక్‌సభకు పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించడంతో దిలీప్ లోక్‌సభ అవకాశాలు దెబ్బతిన్నాయి. దీంతో విశాఖ జిల్లాలో కాపులకు అనుకూలమైన మరో అసెంబ్లీ నియోజక వర్గం చోడవరంపై దృష్టి సారించారు. గత ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున కరణం ధర్మశ్రీ విజయం సాధించారు. మితిమీరిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాల కారణంగా ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. 2009, 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన కేఎస్ఎన్ఎస్ రాజు 2019లో ఓటమిని జీర్జించుకోలేక కొంత కాలం రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన స్థానంలో తాతయ్యబాబును తెలుగుదేశం ఇన్చార్జిగా నియమించింది. వైసీపీ వ్యతిరేకతను గమనించి ఆయన ఇటీవల రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అయ్యారు.

రాజుగారి దూకుడు..

జనసేన నుంచి పీవీఎస్ఎన్ రాజు నియోజక వర్గంలో చురుగ్గా కార్యక్రమాలు చేస్తున్నారు. నియోజక వర్గ సమస్యలపై పాదయాత్ర చేయడంతో పాటు చర్చావేదికలు నిర్వహించి నియోజకవర్గంలో జనసేనను బలమైన పార్టీగా తయారు చేశారు. ఆ నేపథ్యంలో ఆ క్షత్రియులిద్దరినీ, తెలుగుదేశం ఇన్‌చార్జి తాతయ్యబాబును కాదని దిలీప్ చక్రవర్తికి టికెట్ లభించే అవకాశాలు ఎంత మేర ఉన్నాయో చూడాలి. కాపు సామాజిక వర్గం బలంగా ఉండి, శాసనసభ్యుడు ధర్మశ్రీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్న ఆ నియోజక వర్గంలో ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా విజయం సునాయాసమే అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఆ పరిస్థితుల నేపథ్యంలో సీటు ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే.


Read More..

‘ప్చ్.. టికెట్ రాలే’.. ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ, జనసేన నేతల్లో అసంతృప్తి జ్వాలలు..!

Next Story

Most Viewed