బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తు.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ టెన్షన్..!

by Disha Web Desk 2 |
బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తు.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ టెన్షన్..!
X

అధికార వైసీపీలో సిట్టింగులకు షాకులు తప్పడం లేదా ? మూడో జాబితాలో మరి కొందరికి అధిష్టానం మొండిచేయి చూపనుందా ? కొన్ని ప్రాంతాల్లో సిట్టింగులను కాదని కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా? మంత్రి తానేటి వనితకు స్థాన చలనం తప్పదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖాయమని అనుమానించిన వైసీపీ అధినేత జగన్ బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. చాలా వరకు సిట్టింగులను కాదని కొత్త వారికి టికెట్లు ఇవ్వనున్నారనే ప్రచారం జోరందుకుంది. దీంతో అలక నేతల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు రెండు దఫాలుగా సీట్ల కేటాయింపుల్లో 38 మందిని ప్రకటించగా మూడో లిస్టులో మరో 10 మందిని మార్చనున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా.

దిశ, కర్నూలు ప్రతినిధి: మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను వైసీపీ అధినేత జగన్ మారుస్తున్నారు. మరి కొందరికి స్థాన భ్రంశం కల్పిస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా అభ్యర్థులను మార్చారు. మొదటి లిస్టులో 11 మందిని, రెండో లిస్టులో 27 మందిని, మొత్తంగా 38 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. చాలా చోట్ల సిట్టింగులకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. అందులో మల్లాది విష్ణు, గోరంట్ల మాధవ్, పర్వత ప్రసాద్, మద్దాళి గిరి లాంటి వారి పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా మారింది.

సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ టెన్షన్..

రెండో లిస్టులో మంత్రి గుడివాడ అమర్నాథ్ కు పార్టీ షాకిచ్చింది. ఆయన సెగ్మెంట్ అనకాపల్లికి మలసాల భరత్ కుమార్ ను కొత్త ఇంచార్జిగా నియమించింది. ఈ షాక్ లు ఇంతటితో ఆగవని అధిష్టానం చెబుతుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. మూడో జాబితా మరింత కఠినంగా ఉండ బోతుందనే సంకేతాలు విన్పిస్తున్నాయి. ఒకవైపు మంత్రి బొత్స పల్నాడు, గుంటూరు, కృష్ణాలో మినహా ఏ జిల్లాలో అభ్యర్థులను మార్చరని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మూడో లిస్టులో మరో 10 మందిని మార్చనున్నారని తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్ వచ్చిందంటే చాలు.. సీటు గల్లంతు కానుందనే అభిప్రాయానికి నేతలు వచ్చారు. దీంతో ఫోన్ రింగ్ అయితే చాలు సీఎంఓ నుంచి కాదు కదా.. అంటూ ఊపిరి పీల్చుకుంటున్నట్లు సమాచారం. రెండు జాబితాల్లో తప్పించుకున్న వారి పేర్లు మూడో జాబితాలో ఉండబోతాయన్న ప్రచారం సాగుతోంది.

ఈ సెగ్మెంట్లలో మార్పులు..

నందికొట్కూరు, ఆలూరు, కర్నూలు, శింగనమల, గూడూరు, చోడవరం, చింతలపూడి, పెందుర్తి, గోపాలపురం, కొవ్వూరు ప్రాంతాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది. నందికొట్కూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ ను మార్చే అవకాశం ఉంది. అక్కడ కస్టమ్స్ ఆపీసర్ వేల్పుల ఆనంద్ కుమార్, డాక్టర్ సుధీర్ వంటి పేర్లు విన్పిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కు స్థాన చలనమా? లేక మొండిచేయి చూపనున్నారా? అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

సస్పెన్స్‌లో మంత్రి జయరాం..

ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంకు స్థాన చలనమా? మొండిచేయా ? అన్న విషయంపై స్పష్టత లేదు. అక్కడ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, చిప్పగిరి జెడ్పీటీసీ విరుపాక్షి, దివంగత మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజా రెడ్డి కుమార్తె హిమవర్షి రెడ్డి, శశికళ పేర్లు విన్పిస్తున్నాయి. కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు కూడా మొండిచేయి తప్పదని తెలుస్తోంది. అక్కడ ఇంతియాజ్ భాష, పూల బషీర్, కేడీసీసీ చైర్ పర్సన్ విజయ మనోహరి, ఎస్వీ మోహన్ రెడ్డి వంటి పేర్లు విన్పిస్తున్నాయి. శింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి కూడా షాక్ తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ శమంతకమణి, శ్రీనివాస మూర్తి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. చింతలపూడి నుంచి విజయరాజుకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతుండగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలిషా వర్గం ఇప్పటికే తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని ఆందోళనలు చేస్తున్నారు.

మహిళా మంత్రికి స్థాన చలనం?

కొవ్వూరు ఎమ్మెల్యే, మంత్రి తానేటి వనితకు స్థాన చలనం ఉండవచ్చని సమాచారం. ఆమెను గోపాలపురం లేదా చింతలపూడి నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక కొవ్వూరు నుంచి తలారి వెంకట్రావు పేరు విన్పిస్తోంది. ఈ మార్పుల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పేరు కూడా విన్పిస్తోంది.

Next Story

Most Viewed