రక్తపిశాచాలే చంపేశాయి : వైఎస్ వివేకా హత్యపై టీడీపీ నేత సంచలన ఆరోపణలు

by Disha Web Desk 20 |
రక్తపిశాచాలే చంపేశాయి : వైఎస్ వివేకా హత్యపై టీడీపీ నేత సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధించడం వల్లే మాజీ మంత్రి వివేకానందరెడ్డిని హత్య చేశారని వైఎస్ భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది మంగళవారం తెలంగాణ హైకోర్టులో కొత్త వాదన తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వాదనలపై టీడీపీ నేత బీటెక్ రవి ఘటుగా స్పందించారు. మాజీమంత్రి వైఎస్ వివేకాను అతికృరంగా చంపేసిన రక్త పిశాచాలు ఇప్పుడు ఆయన వ్యక్తిత్వంపైనా బురద జల్లుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ రెడ్డి గ్యాంగ్ నాలుక మడతేసినట్టు మరెవరూ వేసి ఉండరని విమర్శించారు.

ఒలింపిక్స్‌లో నాలుక మడత పోటీలు పెడితే గోల్డ్ మెడల్స్ అన్నీ జగన్ మోహన్ రెడ్డి ముఠానే సొంతం చేసుకుంటుందని సెటైర్లు వేశారు. వైఎస్ వివేకా మరణంపై తొలుత గుండెపోటుగా చిత్రీకరించి డ్రామా మెుదలు పెట్టారని ఆ డ్రామాలో నాలుగేళ్ల నుంచి అనేక మలుపులు తిరుగుతున్నాయని విమర్శించారు. మెుదట గుండెపోటు అన్నారని ఆ తర్వాత చంద్రబాబే గొడ్డలితో నరికించారన్నారని..అంతేకాదు‘నారాసుర చరిత్ర’ అనే పుస్తకాలు కూడా ప్రచురించారని ఆరోపించారు. ఆ తర్వాత అల్లుడే హత్య చేశాడన్నారని.. రక్తపు వాంతులతో చనిపోయాడన్నారని ఆ తర్వాత ఆస్తి తగాదాలు కూడా కారణమేనని ఆరోపించారన్నారు.

చివరకు రెండో పెళ్లి చేసుకున్నాడని వివేకానందరెడ్డి పేరు కూడా మార్చుకున్నారని సొంత కుటుంబీకులే ఆరోపణలు చేశారని అవన్నీ చాలవన్నట్లు తాజాగా లైంగిక ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ప్రతిపక్షంలో ఉండగా వివేకా హత్యకేసు పై సీబీఐ దర్యాప్తు అవసరమన్న వైఎస్ జగన్‌ అధికారంలోకి వచ్చాక అవసరం లేదని నాలుక మడతేశారని గుర్తు చేశారు. వైఎస్ వివేకా కుమార్తె తన తండ్రి మర్డర్ విషయంలో వాస్తవం వెలుగులోకి రావాలని నిందితులకు కఠిన శిక్షలు పడాలని ఆమె పోరాటం చేస్తుంటే ఆమెపైనా చౌకబారు నిందలేస్తుండటం విచారకరమని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు.


Next Story