16న పెద్దాపురంలో టీడీపీ అధినేత సభ.. గళం విప్పుతారా? గమ్ముగుంటారా?

by Disha Web Desk 4 |
16న పెద్దాపురంలో టీడీపీ అధినేత సభ.. గళం విప్పుతారా? గమ్ముగుంటారా?
X

తెలుగుదేశం పార్టీ అధినేత తమ ప్రాంతానికి వస్తే ఇక కార్యకర్తలు, నాయకుల్లో కొత్త జోష్ వస్తుంది. మరో వైపు అధినేత రావడంతో కార్యకర్తల్లో వచ్చే ఉత్సాహం తమ ప్రాంతంలో పార్టీ బలపడటానికి ఉపయోగపడుతుందని భావిస్తారు. కానీ ఈ నెల 16న చంద్రబాబు పెద్దాపురంలో ఏర్పాటు చేస్తున్న సభ సందర్భంగా అటు నాయకులు, ఇటు కార్యకర్తల్లో అంతర్గతంగా ఆందోళన కనిపిస్తోంది.

దిశ, ( ఉభయ గోదావరి ప్రతినిధి): నియోజకవర్గంలోని రామేశం‌పేట భూముల విషయమై స్థానిక శాసనసభ్యుడు, మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప వైసీపీ నాయకులతో ఒప్పందం కుదుర్చుకున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో తెలుగు తమ్ముళ్లు కాస్త గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు పెద్దాపురం సీటు ఈ సారి కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనే డిమాండు ఉంది. అయితే సీటు తనకేనంటూ చినరాజప్ప ప్రకటించుకున్నారు. ఈ అంశం అధిష్టానానికి కూడా కోపం తెప్పించిందని తెలిసింది.

తమ్ముళ్లే అధినేతకు విన్నవిస్తారా ?

స్థానిక ఎమ్మెల్యే చినరాజప్ప వ్యవహారంతో టీడీపీ నేతలు విసిగిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ వద్దకే వస్తున్న అధినేతకు పెద్దాపురం వ్యవహారాలన్నింటినీ తెలియజేయాలని తమ్ముళ్లు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదముందని రాజకీయ నిపుణులు అంటున్నారు.

తెర మీదకు రామేశంపేట భూములు

పెద్దాపురం నియోజకవర్గం పరిధిలో రామేశం పేట, సూరంపాలెం, వాలు తిమ్మాపురం, కొండపల్లి, ఆనూరు గ్రామాల పరిధిలో రామేశం మెట్ట పేరుతో 579 ఎకరాల గ్రావెల్ కొండ ఉంది. ఈ భూముల్లో ఎస్సీ కార్పొరేషన్ కింద 429 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. జీడి మామిడితోట ఉపాధి కల్పన నిమిత్తం ఒక్కో రైతుకు 1.35 ఎకరాలు అందచేశారు.

రైతులు గత 42 సంవత్సరాలుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. సాలీనా ఒక్కో ఎకరంపై రూ.60 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. గతంలో రాజప్ప డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వైసీపీ వారితో రాజప్ప కుమ్మక్కు అయినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వైసీపీ శ్రేణులకు కౌంటర్ ఎందుకివ్వలేదు ?

రామేశం భూముల వ్యవహారంపై ఇటీవల కాకినాడ మాజీ శాసనసభ్యుడు వనమాడి వెంకటేశ్వరరావు కాకినాడ కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. దీన్ని కాకినాడ సిటీ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. పెద్దాపురం విషయం నీకెందుకు.. రాజప్ప చూసుకొంటారులే అన్నారు.

అయితే ఈ మేరకు రాజప్ప నుంచి కనీస స్పందన లేకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం కలిగించింది. అంతర్గతంగా కుమ్ములాటలూ ప్రారంభమయ్యాయి. ఇదే విషయమై అధినేత సభలో రగడ జరిగే అవకాశం ఉందని కొందరు టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.



Next Story

Most Viewed