Telugu Desam Party :నెల్లూరు రూరల్లో టీడీపీ జోష్

by Disha Web Desk 10 |
Telugu Desam Party :నెల్లూరు రూరల్లో  టీడీపీ జోష్
X

దిశ, నెల్లూరు: జిల్లాలో రూరల్ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. చంద్రబాబు పథకం ప్రకారమే కోటంరెడ్డి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధమవుతున్నారని తెలిసింది. వైసీపీ నుంచి బహిష్కారానికి గురైన కోటంరెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధపడ్డా ప్లాన్ ప్రకారమే కోటంరెడ్డిని టీడీపీలో చేర్చుకోకుండా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా కొనసాగి ప్రభుత్వ విధివిధానాలపై పోరాడాలని కోటంరెడ్డికి చంద్రబాబు సూచించినట్లు సమాచారం. వైసీపీ పెద్దలపై విమర్శలు చేసే ముందు వైసీపీ ఎమ్మెల్మే కోటంరెడ్డి టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణతో భేటీ అయ్యారని అప్పటి నుంచి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు టచ్‌లోకి వచ్చారని టీడీపీ అధినేత నుంచి కీలక హామీ పొందిన తరువాత చంద్రబాబు ఇచ్చిన ప్లాన్‌తో కోటంరెడ్డి వైసీపీ తిరుగుబాటు చేశారని విశ్వసనీయ సమాచారం.

- వైపీసీ వర్సస్ శ్రీధర్ రెడ్డి

వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకెక్కింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ వైసీపీ అధినాయకత్వం సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు ప్రభుత్వ పెద్దలు తమ ఫోన్ ట్యాప్ చేసి తన మాటలు చాటుగా వింటున్నారని కోటంరెడ్డి వైసీపీలోని కీలక నేతలపై ఆరోపణలు చేశారు. దీంతో అప్పటి నుంచి మొదలైన వార్ చినికిచినికి గాలివానగా మారి కోటంరెడ్డిని సస్పెండ్ చేసే వరకు వచ్చింది. దీంతో ఆయన వైసీపీకి రెబల్ ఎమ్మెల్యేగా ఆ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. రూరల్ రాజకీయం ఇప్పుడు వైపీసీ వర్సస్ శ్రీధర్‌రెడ్డిగా మారింది.

- ఫలించిన చంద్రబాబు ప్లాన్

వైసీపీ ఎమ్మెల్యేగా శ్రీధర్‌రెడ్డి కొనసాగినంత కాలం ఆ పార్టీకి రూరల్ నియోజకవర్గం అనుకూలంగా ఉండేది. కోటంరెడ్డి వైసీపీని వీడడంతో వైసీపీ కొంత బలహీన పడింది. ప్రభుత్వంతో కలిసి పనిచేసిన కోటంరెడ్డికి వాటి అంతర్గత విషయాలు బాగా తెలుసు. దీంతో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన ఆయన వైసీపీని తన పోరాటాలతో ఇరకాటంలో పడేస్తున్నారు. పదేపదే అభివృద్ధిని ప్రశ్నిస్తుండడంతో చివరకు జగన్ సర్కార్ చేసేదేమీ లేక రూరల్ నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయాల్సి వచ్చింది. కోటంరెడ్డి పోరాటం వల్లే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని ప్రజలు బలంగా నమ్మడంతో ఇది వైసీపీకి మైనస్‌గా మారింది. రూరల్ నియోజకవర్గంలో వైసీపీ పూర్తిగా బలహీనపడడం టీడీపీకి ప్లస్‌గా మారింది. చివరి నిమిషంలో కోటంరెడ్డి టీడీపీలో చేరి ఎన్నికల సమయంలో రూరల్ నుంచి పార్టీ బీఫామ్ అందుకుంటారని, ఇది వరకే ఈ విషయంపై చంద్రబాబు కోటంరెడ్డికి హామీ ఇచ్చారని తెలిసింది. చంద్రబాబు వేసిన ప్లాన్ ప్రకారమే కోటంరెడ్డిని ఉపయోగించుకుని టీడీపీ లబ్ధి పొందుతోందని రాజకీయ విమర్శకులు చెప్పుకుంటున్నారు.

- అబ్దుల్ అజీజ్‌కు పార్లమెంట్

2019 ఎన్నికల్లో రూరల్ టీడీపీ నుంచి అబ్దుల్ అజీజ్ పోటీ చేసి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై గెలుపొందలేక పోయారు. అప్పటి నుంచి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా, నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి‌గా అబ్దుల్ అజీజ్‌కు టీడీపీ బాధ్యతలు అప్పగించింది. అయితే తన ప్రత్యర్థి అయిన శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరడాన్ని అజీజ్ వ్యతిరేకించారు. గిరిధర్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్న సమయంలో అజీజ్ ఆ కార్యక్రమానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అజీజ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. మాజీ మంత్రి నారాయణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్, మాజీ కార్పొరేటర్ జలీల్‌తో కలిసి హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అబ్దుల్ అజీజ్‌కు నెల్లూరు పార్లమెంట్ టికెట్‌‌పై హామీ ఇచ్చారని తెలిసింది.

Read more:

కళ్యాణదుర్గం టీడీపీలో ముసలం

Next Story

Most Viewed