ఆ నియోజకవర్గంలో టీడీపీకి గడ్డుకాలమేనా..?

by Disha Web Desk 3 |
ఆ నియోజకవర్గంలో టీడీపీకి గడ్డుకాలమేనా..?
X

దిశ ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి కడపలో వైసీపీని ధీటుగా ఎదుర్కునేందుకు పావులు కదపాల్సిన తెలుగుదేశం పార్టీ, జిల్లా వ్యాప్తంగా అసంతృప్తులను మూటకట్టుకుంటోంది. పలు చోట్ల ఫిరాయింపులు తప్పలేదు. నేతల అసమ్మతి, అలకలు, ఫిరాయింపులు ఆ పార్టీకి ఏదో ఒక రూపంలో అన్ని చోట్లా ఎన్నికల పోరుకు నష్టదాయక పరిణామాలకు దారి తీస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లోనూ ఇలా ఏదో రకమైన సమస్య ఎదుర్కొంటోంది. నేతల మధ్య సఖ్యత కుదిర్చి సమిష్టిగా పని చేయించుకునే పటిష్టమైన ప్రయత్నాలపై అధిష్టానం దృష్టిపెట్టకపోవడంతో ఇలాంటి గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నది విశ్లషకుల అభిప్రాయం. ఇక జిల్లా తెలుగుదేశం పార్టీలో, ఉమ్మడి జిల్లా కేంద్రమైన కడప నుండి విభజిత అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వరకు పార్టీలో అలకలు, అసంతృప్తులు తప్పలేదు. అసెంబ్లీ అభ్యర్థుల ఖరారులో ముందుచూపుతో లేకపోవడం, అప్పటికప్పుడు అభ్యర్థులను ఖరారు చేయడం, ఆ సమయంలో మిగతా ఆశావహులతో ఒకటికి రెండు సార్లు సంప్రదించి ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేయకపోవడం లాంటివి ప్రధానంగా ఇలాంటి పరిస్థితులకు దారి తీసాయని సమాచారం.

కాగా జిల్లా కేంద్రమైన కడప అసెంబ్లీ నుంచే ఈ పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక్కడ ఐదేళ్లుగా పార్టీ ఇంచార్జిగా ఉన్న అమీర్ బాబును తీరా ఎన్నికల ముందు తప్పించి ఆ బాధ్యతలను మాధవీ రెడ్డికి అప్పగించారు. అలానే ఆమెకు టికెట్ కూడా ఇచ్చారు. దీంతో అమీర్ బాబు తోపాటు కడప టిక్కెట్ గట్టిగా ఆశించి ప్రయత్నించిన అలంఖాన్ పల్లె లక్ష్మి రెడ్డి కుటుంబం అసంతృప్తి గురయ్యారు. వీరు ఇన్చార్జిని మార్చిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాలు చేపడుతూనే వచ్చారు. కాకపోతే ఇన్చార్జి మాధవీ రెడ్డితో సంబంధం లేకుండా వారు వేరుగా పార్టీ కోసం కార్యక్రమాలు చేపట్టారు.

ఇంతా జరుగుతున్నా ఇప్పటి వరకు అధిష్టానం నుంచి కానీ, జిల్లాలోని ముఖ్య నేతలు గాని వీరిద్దరితో కలిసి సర్దుబాటు చేసే ప్రయత్నాలు జరిగినా ఆ ప్రయత్నాలు వారి మద్య సర్దుబాటు చేయలేక పోయాయి. దీంతో కడపలో ప్రధానమైన నాయకుల ప్రభావం అసెంబ్లీ ఎన్నికల పై చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రొద్దుటూరు అసెంబ్లీలో కూడా నేతల మధ్య అంత సఖ్యత ఉన్నట్టు కనిపించడం లేదు. ఇక్కడ కూడా మొదటి నుంచి అసెంబ్లీ టికెట్ అక్కడి ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డికే అంటూ ప్రచారం జరిగింది.

ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు వరద రాజుల రెడ్డి, లింగారెడ్డిలు టికెట్ కోసం ప్రయత్నించారు. చివర్లో వరదరాజ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో అక్కడి మిగతా నేతలు ఏ మేరకు పార్టీ సహకారం అందిస్తారన్నది చూడాల్సింది. ఇక ఇక్కడ అంతా బాగుందనుకుంటూ వస్తున్న మైదుకూరులో కూడా అక్కడి సీనియర్ నేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయిన కూడా ఆ తర్వాత అతను పార్టీ పట్ల సానుకూలంగా ఉంటూ వచ్చినా, ఆ పార్టీ నాయకులతో కలిసి‌మెలుస్తూ వచ్చినా ఆయన్ను పార్టీకి తిరిగి తీసుకోకపోవడంతో ఆయన పార్టీ వీడి వైసీపీలోకి చేరారు.

కమలాపురంలోనూ ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. ఈ నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీ మాజీ కార్యదర్శిగా ఉన్న సాయి నాధశర్మను రెడ్యం వెంకట సుబ్బారెడ్డితో పాటు సస్పెండ్ చేశారు. ఆయనను కూడా పార్టీలోకి తిరిగి తీసుకునే ప్రయత్నాలు కనిపించకపోవడంతో ఆయన కూడా వైసీపీలోకి ఫిరాయించారు. ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కూడా వైసీపీలో చేరతారన్న ప్రచారం సాగుతోంది. ఇందుకు తోడు సోమవారం చంద్రబాబుపై చేసిన ఆరోపణలు బలం చేకూరుస్తున్నాయి.

సాయినాథ్ శివారెడ్డిలు ఇరువురు పార్టీకి అనుకూలంగా ఉండి ఉంటే అందుకు తగ్గట్టే ఫలితాలు కూడా వచ్చేవని పలువురు భావిస్తున్నారు. ఇక పులివెందులలో కూడా ఇదే పరిస్థితి. టీడీపీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉంటూ వైఎస్ కుటుంబాన్ని ఎదుర్కొంటూ క్యాడర్‌ ను నిలబెట్టిన సతీష్ రెడ్డి కొంతకాలంగా స్తబ్దుగా ఉంటూ వస్తున్నారు. ఆయనను కూడా తిరిగి పార్టీలకు చేర్చుకునే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ విఫలమైంది. అయితే ఆయనను వైసీపీలో చేర్చుకోవడంతో ఆ పార్టీకి మరింత సానుకూలత ఏర్పడిందనే చెప్పాలి.

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జోరు తగ్గడానికి అక్కడ సీటు కేటాయింపు కారణం అయింది. తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరిన రోషన్నకు చివరి వరకు టికెట్ ఇస్తామని ఝలక్ ఇచ్చారు. ఆ స్థానం బీజేపీకి కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృకి గురయ్యారు. వెంటనే బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

దీంతో తెలుగుదేశం ఓటింగ్ ఏ మేరకు వారికి బదిలీ అవుతుందనేది ఇప్పుడు అక్కడ జరుగుతున్న ప్రధాన చర్చ. జమ్మలమడుగులోను తెలుగుదేశం పార్టీ అనుసరించిన వైఖరి అక్కడ పార్టీకి నష్టదాయకంగానే మారింది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరాక పూర్తి స్థాయిలో పార్టీని భుజంపై వేసుకొని నడిపిన ఇంచార్జి భూపేష్ రెడ్డికి తీరా అసెంబ్లీ టికెట్ కాకుండా పార్లమెంటు టిక్కెట్ ఇవ్వడం, అసెంబ్లీ సీటు బీజేపీకి కేటాయించడంతో అక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి ఊపు తగ్గిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉమ్మడి కడప జిల్లా నుండి విడిపోయిన అన్నమయ్య జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలైన రాజంపేట, రాయచోటి , కోడూరులో కూడా ఏర్పడ్డ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కరంగా మారాయి. రాజంపేట అసెంబ్లీ టికెట్టు పొత్తులో జనసేనకు కేటాయిస్తారని భావించారు. టికెట్ తనకే దక్కుతుందని యల్లటూరు శ్రీనివాసరాజు ప్రచారం కూడా చేపట్టారు.

అయితే టీడీపీనే పోటీ చేయాలని ఆ పార్టీ నాయకులు భావిస్తూ వచ్చారు అక్కడ ఇన్చార్జి చెంగల్ నాయుడు ,తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజులు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే ఇవేవీ కాదని ఉన్నఫలంగా రాయచోటికి చెందిన మాజీ ఎంపీ పాలకొండ్రాయుడి తనయుడు సుబ్రమణ్యంకు కేటాయించారు.

దీంతో అక్కడ జనసేన నాయకులు శ్రీనివాసరాజు, టీడీపీ ఆశావహుడు జగన్మోహన్‌రాజులు సర్దుకుని పోయినా టీడీపీ ఇన్చార్జిగా ఉన్న చెంగల్ రాయుడు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాయచోటి ఇన్చార్జిగా ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డిని కాదని మరో నేత రాం ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో రమేష్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ జెండాలను తగలబెట్టారు.

చివరకు రమేష్ రెడ్డి వైసీపీలో చేరే పరిస్థితి ఏర్పడింది . రైల్వే కోడూరులో అక్కడి నుంచి గతంలో పోటీ చేసిన టీడీపీ నాయకుడు పంతగాని ప్రసాదు టికెట్ ఆశించారు . ఆయనతోపాటు ఇద్దరు మహిళలు టికెట్‌లు ఆశించారు. అయితే చివరికి అక్కడ జనసేనకి టికెట్ కేటాయించడంతో టీడీపీలో కొంత అసంతృప్తి ఏర్పడింది.

ఇలాంటి పరిణామాలన్నీ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో రకమైన అసంతృప్తులకు, పార్టీ ఫిరాయింపులకు దారితీస్తూ రావడం టీడీపీకి నష్టం చేకూర్చే అంశాలుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి టీడీపీ అధిష్టానం నేతల సర్దుబాట్లపైన, సఖ్యత పైన దృష్టి పెట్టి వైసీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పటికైనా గట్టి ప్రయత్నాలు చేస్తుందేమో చూడాలి. లేదంటే టీడీపీతో పాటు కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న బీజేపీ , జనసేన అభ్యర్థులపైన ఈ ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో లేకపోలేదు.


Next Story

Most Viewed