వైసీపీకి బలం.. బలహీనత అతనొక్కడేనంటా?

by Dishanational1 |
వైసీపీకి బలం.. బలహీనత అతనొక్కడేనంటా?
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రిగా జగన్​అధికారాన్ని చేపట్టిన రోజు నుంచీ ప్రజలను నేరుగా కలుసుకోవడానికి ఆసక్తి చూపలేదు. అక్కడ నుంచి ఎమ్మెల్యేలకు అపాయింట్​మెంటు దక్కలేదు. చివరకు మంత్రులు సైతం సీఎంను కలవడానికి అవకాశం కోసం ఎదురు చూడాల్సివచ్చేది. పార్టీ అధినేతగా జగన్​తీసుకునే నిర్ణయాలను ఆమోదిస్తూ ఎమ్మెల్యేలు, మంత్రులు చేతులెత్తేయడం, బల్లలు చరచడం తప్ప తల అడ్డంగా ఊపిన దాఖలాల్లేవు. సదరు నిర్ణయాలపై తమ అభిప్రాయాలను వెల్లడించేందుకూ సాహసించలేదు. ఓ రకంగా చెప్పుకోవాలంటే అలాంటి చొరవకు సీఎం జగన్ ఎప్పుడూ అవకాశమే ఇవ్వలేదని తెలుస్తోంది. అది అంతర్లీనంగా పెరిగి పెద్దదై ఇప్పుడొక్కసారిగా అసహనం రూపంలో బయటికి తన్నుకొస్తోంది.

వాళ్లపై వేటుకే మొగ్గు?

ఎమ్మెల్యేలు, మంత్రుల్లో పెరుగుతున్న అసహనాన్ని తగ్గించడానికి రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. కనీసం వాళ్లయినా తమ అభిప్రాయాలను జగన్​వద్ద నిర్మొహమాటంగా వెల్లడించే చొరవకు అవకాశం కల్పించలేదు. లేకుంటే ఎమ్మెల్యేల్లో ఇంతగా అసమ్మతి పెల్లుబుకేది కాదని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తున్న వాళ్లను బుజ్జగిస్తే పార్టీ యంత్రాంగంలోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే దానిపై చర్చించారో లేదో. వాళ్లపై వేటు వేయడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తమకు సీటు దక్కదని భావించిన వాళ్లంతా ఏదో ఒక సాకుతో నిరసన తెలిపి పార్టీకి దూరంగా జరగడానికి ప్రాధాన్యమిస్తారని రాజకీయ పరిశీలకుల అంచనా.

టీడీపీ హయాంలో అలా...

వ్యక్తి స్వామ్యంతో నడిచే ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటి పోకడలు కొత్త కాదు. వైసీపీనే చివరి పార్టీ కాదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సొంత నిర్ణయాలనే అమలు చేసేవారు. దానికి అంతర్గత ప్రజాస్వామ్యాన్ని జోడించేవారు. ఏదైనా పార్టీ లేదా ప్రభుత్వ పరంగా ఓ నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు చంద్రబాబు ఓ ఎత్తుగడ ప్రకారం అమలు చేసేవారు. ముందుగా మీడియాకు లీకులు ఇస్తారు. దానిపై పార్టీలో తర్జనభర్జనలు మొదలవుతాయి. ఎవరు అనుకూలం.. ఎవరు వ్యతిరేకం.. మరెవరు తటస్థంగా ఉన్నారో గమనిస్తారు. వ్యతిరేకంగా ఉన్నవాళ్లను వేరే రూట్లో బుజ్జగించి ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించే వారు.

ఎవరైనా జగన్ చెప్పినట్లు వినాల్సిందే...

వైసీపీ అధినేత ఇలాంటి వ్యూహం జోలికి వెళ్లలేదు. ఆది నుంచీ ఆయన బోధించే అధ్యాపకుడు.. రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్​చార్జులు విద్యార్థులుగా మసలుకునేట్లు వ్యవహరించారు. ఎవరైనా చొరవ తీసుకుని ఓ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చితే సదరు నేతపై ఫైర్ అయ్యేవారు. దీంతో మిగతావాళ్లు మౌనం వహించడం ఇప్పటిదాకా సాగింది. అందుకే మొదట గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి నుంచి అసహనం మొదలై పత్తిపాడు ఎమ్మెల్యే సుచరితతో మరింత పెరిగింది.

పార్టీలో అలజడి...

ప్రకాశం జిల్లా గిద్దలూరు, దర్శి ఎమ్మెల్యేలు గొంతు విప్పారు. అదే సమయంలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్​రెడ్డి కూడా పేదల గృహ నిర్మాణంపై ప్రజల గొంతుక వినిపించారు. జిల్లాల విభజన సహేతుకంగా లేదని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నిర్మొహమాటంగా తేల్చిచెప్పారు. ఆయన తర్వాత కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి డ్రైనేజీలో నిలబడి ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. తర్వాత రాయలసీమకూ పాకింది. ఇవన్నీ కూడా వాళ్ల నియోజకవర్గాల్లో ప్రజల స్పందనగా ప్రభుత్వ అధినేతగా జగన్​గుర్తించినట్లు లేదు. వాళ్ల నాయకత్వానికి బీటలు వారుతున్నాయని ఆందోళన చెందడం వల్లే వాళ్లు నిరసన గళం విప్పినట్లు భావించలేదు. వీటన్నింటి పర్యవసానమే పార్టీలో అలజడికి కారణమైనట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇక పార్టీ టిక్కెట్​దక్కదని భావించేవాళ్లు కూడా ఏదో ఒక సాకుతో బయటకు పోయేందుకు ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. గురువారం నిర్వహించిన రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో సీఎం జగన్​దీనిపై లోతుగా చర్చించారా లేదా అనేది స్పష్టం కావాల్సి ఉంది.

Next Story

Most Viewed