సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పని ఒత్తిడే కారణమా?

by Disha Web Desk 7 |
సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పని ఒత్తిడే కారణమా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా బొమ్మనపల్లి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వెంకటేశ్-సీతమ్మ దంపతుల కుమారుడు సాయిప్రసాద్(25) బెంగళూరులో సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆ సంస్థలో పనిఒత్తిడి అధికంగా ఉంది. ఇదే విషయాన్ని ఇటీవలే స్వగ్రామానికి వచ్చిన సాయిప్రసాద్ తల్లిదండ్రులకు తెలియజేశాడు. వేరే కంపెనీలో చేరాలనుకుంటున్నట్లు కూడా తెలియజేశాడు. అయితే అర్జెంట్ పనివుందని తల్లిదండ్రులకు చెప్పి తిరిగి బెంగళూరుకు వెళ్లి ఆదివారం తిరిగి వచ్చాడు.

అర్థరాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లారినా సాయిప్రసాద్ గదిలోంచి బయటకురాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు పగలగొట్టి లోపలకి వెళ్లారు. అయితే సాయిప్రసాద్ ఉరితాడుకు విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సాయిప్రసాద్ ఆత్మహత్యకు పని ఒత్తిడియే కారణమా లేక వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.


Next Story

Most Viewed