ఆర్-5 జోన్‌లో పరిశ్రమల రాకను అడ్డుకోవడానికే స్కెచ్?

by Hamsa |
ఆర్-5 జోన్‌లో పరిశ్రమల రాకను అడ్డుకోవడానికే స్కెచ్?
X

అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదా! ప్రతిపక్షాలన్నీ పెత్తందార్ల కొమ్ముకాస్తున్నారు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు.. అంటూ అధికార వైసీపీ పెద్దలు విపక్ష నేతలను దుమ్మెత్తిపోస్తున్నారు. రాజధాని రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ హైకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దీంతో సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. అసలు ప్రభుత్వం ఎందుకు ఇంత పట్టుదలకు పోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రతిపాదించిన ఇళ్ల స్థలాల భూములు వివాదం కావడంతో పేదలు పట్టాలకు నోచుకోలేదు. అవన్నీ గాలికొదిలేసి రాజధానిలో పేదలకు ఇవ్వాలనుకున్న సెంటు పట్టాలపైనే ఎందుకంత మొండిగా వ్యవహరిస్తుందని చర్చనీయాంశమైంది.

దిశ, ఏపీ బ్యూరో: రాజధాని మాస్టర్​ ప్లాన్​ ప్రకారం 28,789 మంది రైతుల నుంచి మొత్తం 34,387 ఎకరాలను గత ప్రభుత్వం ల్యాండ్​ పూలింగ్​ ద్వారా సేకరించింది. అందులో రైతుల పట్టా భూమి 31,702 ఎకరాలు. ఎస్సీ ఎస్టీల అసైన్డ్​ భూములు 2,684 ఎకరాలు. రాజధానికి భూములు ఇచ్చేటప్పుడే పేదల నివాసాలకు 5 శాతం భూములు కేటాయించేందుకు నాడు రైతులు అంగీకారం తెలిపారు. దీంతో నాటి ప్రభుత్వం రెసిడెన్షియల్​ జోన్​ 3 కింద 11,867 ఎకరాలు రిజర్వు చేసింది. అందులో భూములు ఇచ్చిన రైతులు, ఎస్సీ ఎస్టీలకు అభివృద్ధి చేసిన ఇళ్ల ప్లాట్లు కేటాయించింది. ఇక్కడే 44.05 ఎకరాల్లో అఫర్డబుల్​ హౌసింగ్​ కింద ప్రభుత్వం 5,024 టిడ్కో ఇళ్లు నిర్మించింది. ఇంకా ఇక్కడ 1.675 ఎకరాలు అందుబాటులో ఉంది.

ఆర్-5 జోన్ ను అందుకే సృష్టించారా?

ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాజధానిలో ఇతర ప్రాంతాలకు చెందిన పేదలకు సెంటు చొప్పున 50 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. దాదాపు 1500 ఎకరాలు అవసరమవుతుంది. ఈమేరకు ఆర్​ 3 జోన్​లో భూమి అందుబాటులో ఉంది. అక్కడ లేఅవుట్​ వేసి పేదలకు నివాస స్థలాలు ఇవ్వడానికి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు సైతం అభ్యంతరం లేదు. దీనికి భిన్నంగా ప్రభుత్వం పారిశ్రామిక అవసరాలకు వదిలిన భూమిలో ఆర్​ 5 జోన్​ను సృష్టించింది. అందులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పట్టుబడుతోంది. అందుకే ఈవివాదం న్యాయ స్థానాలదాకా వెళ్లింది.

టిడ్కో ఇళ్లను ఎందుకు ఇవ్వడం లేదు?

రాష్ట్ర ప్రభుత్వానికి పేదల పట్ల చిత్తశుద్ది ఉంటే గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఇప్పటిదాకా లబ్దిదారులకు ఎందుకు ఇవ్వలేదని విపక్షాలు నిలదీస్తున్నాయి. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలని వామపక్షాలు ఆందోళనకు దిగాయి. అయినా నాలుగేళ్ల నుంచి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎలక్ట్రానిక్​ సిటీ కోసం కేటాయించిన భూమిని పేదల నివాసానికి కేటాయిస్తే ఇక్కడకు పరిశ్రమలు ఎలా వస్తాయి? అమరావతి అభివృద్ధికి ఇది ఆటంకం కాదా? అంటూ భూములు ఇచ్చిన రైతులు అడ్డం తిరుగుతున్నారు. ఆర్​3 జోన్​లో తమకు ఇచ్చిన చోటునే పేదలకూ ఇంటి స్థలాలు ఇవ్వొచ్చు కదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఇచ్చినట్లే ఇచ్చి.. లాక్కునే ఎత్తుగడ?

అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఇక్కడ పేదలకు సెంటు చొప్పున స్థలాలు ఇచ్చి తిరిగి వాటిని వైసీపీ నాయకులే నొక్కేసే కుట్ర దాగుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజధాని పరిసర ప్రాంతాల్లోని వైసీపీ కార్యకర్తల ఆధార్​, ఓటరు కార్డులు మార్పించి రానున్న ఎన్నికల్లో వాళ్ల ఓట్లతో గట్టెక్కేందుకు పేదలను అడ్డుపెట్టుకుంటున్నదని విమర్శిస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన భూముల విలువ ఎక్కువ. వీటిని ఏదోరకంగా సొంతం చేసుకునేందుకు పేదలను ముందు పెడుతున్నారని దుయ్యబడుతున్నారు. మరో నాలుగు రోజుల్లో సుప్రీం కోర్టు ఈ కేసుకు ముగింపు పలికే అవకాశముంది.

Advertisement

Next Story