చంద్రగిరి నాడి ఎటు ?

by Disha Web Desk 12 |
చంద్రగిరి నాడి ఎటు ?
X

దిశ, చంద్రగిరి: చంద్రగిరి పేరు చెప్పగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది చంద్రగిరి కోట. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో చంద్రగిరి కోటపై ఎవరు జెండా ఎగరవేస్తారు అనే చర్చ మొదలైంది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎలక్షన్ లో వైసీపీ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసింది. 2019 ఎలక్షన్‌లో చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచిన తర్వాత తుడా చైర్మన్ గాను, టీటీడీ బోర్డు మెంబర్ గాను, ప్రభుత్వ విప్ గాను బాధ్యతలు చేతబట్టారు. 2024 ఎన్నికల్లో తన కుమారుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టి వైసీపీతో హ్యాట్రిక్ కొట్టించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

1994 నుంచి టీడీపీ పోరాటం..

కానీ తెలుగుదేశం పార్టీ 1994 తర్వాత నుంచి చంద్రగిరిలో తన సత్తా చాటుకోలేకపోయింది. 2019 ఎలక్షన్ లో తెలుగుదేశం తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పులివర్తి నాని ఓడిపోయారు. కానీ ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్య తిరుగుతూ 2024 లో మరల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆశీస్సులతో ఎలక్షన్లలో పోటీ చేయడానికి సీటు సంపాదించుకున్నారు. సీటును సంపాదించుకోవడమే కాకుండా గతంలో ఎవరైతే చంద్రగిరి ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నించారో వారందరినీ ఒప్పించి తన గెలుపుకు ఎటువంటి అడ్డంకి లేకుండా చేసుకున్నారు. కానీ చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అసలు తలనొప్పి ప్రారంభమైంది. ఇంతకాలం టీడీపీ ఎమ్మెల్యే సీటును ఆశించిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త డాలర్స్ దివాకర్ రెడ్డి, ఓబీసీ ఫోరం అధ్యక్షుడు బడి సుధా యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గెలుపునకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

అందరూ కలిసి వస్తే..

ఒకవేళ డాలర్స్ దివాకర్ రెడ్డి బడి సుధా యాదవ్ , టీడీపీకి రెబల్స్ గా ఉంటే వైసీపీకి ఓట్ల శాతం పెరిగి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సునాయాసంగా గెలవచ్చు అని ఆలోచన ఉన్నారు. కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగింది. రెడ్డి సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గంతో పాటు బలిజ సామాజిక వర్గంలో సైతం వైసీపీకి పడవలసిన ఓట్ల శాతం తగ్గనున్నాయి. ఇటీవల చంద్రగిరిలో టీడీపీకి మద్దతుగా కాపు సామాజిక వర్గంలో బలమైన నేత వంగవీటి రాధ నిర్వహించిన సభ పెద్ద ఎత్తున విజయం సాధించడంతో బలిజ సామాజిక వర్గం ఓట్ల సైతం టీడీపీకి అధిక శాతంలో పడనున్నాయి. అంతే కాకుండా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు నిర్ణయించే ఓటు బ్యాంకు కలిగిన పాకాల మండలం లో, తిరుపతి రూరల్ మండలం లో గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయానికి తోడ్పడిన ముఖ్య నాయకులందరూ టీడీపీలోకి వలసలు వెళుతున్నారు. పులివర్తి నాని గెలుపుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు.

చెవిరెడ్డి కుటుంబ పాలన నచ్చకే..

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ పాలన నచ్చకే పార్టీని వీడుతున్నామని వాపోతున్నారు. ఇది ఇలా ఉండగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన పి.ఏ, పి.ఆర్.ఓ ల మాటలకే ఎక్కువ విలువ ఇస్తున్నారని తమను పట్టించుకోవడం లేదని కొందరు ముఖ్య నాయకులు నొచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలుపు నల్లేరుపై నడకల్లాగా మాత్రం ఉండదని దాదాపు 20 సంవత్సరాల తర్వాత చంద్రగిరి కోటపై టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed