కత్తి మీద సామే..! టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య సయోధ్యకు బాబు, పవన్ కసరత్తు

by Disha Web Desk 1 |
కత్తి మీద సామే..! టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య సయోధ్యకు బాబు, పవన్ కసరత్తు
X

టీడీపీ, జనసేన పొత్తులో సీట్లు కోల్పోయిన వాళ్ల నిరసనలు కొనసాగుతున్నాయి. గోదావరి జిల్లాల్లో ఇంకా చల్లబడలేదు. టిక్కెట్లు దక్కని నేతలను చంద్రబాబు పిలిపించి మాట్లాడుతున్నారు. నాయకులను బుజ్జగించే పనిలో జనసేన నేత నాదెండ్ల మనోహర్​ బిజీగా ఉన్నారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించే ఉమ్మడి సభతో విభేదాలు సమసిపోతాయని చంద్రబాబు, పవన్​ భావిస్తున్నారు. రేపు బీజేపీతో కూడా పొత్తు కుదిరితే.. వాళ్లకిచ్చే స్థానాల్లో పరిస్థితేమిటో అంటూ ఉభయ పార్టీల శ్రేణుల్లో ఆందోళన నెలకొన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్​ కల్యాణ్​ ఆది నుంచీ చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే లక్ష్యంతోనే ఆయన ఉన్నారు. ఈ మధ్యలో సీఎం అవకాశం వస్తే అందుకు సంసిద్దంగా ఉన్నానంటూ​ చెప్పుకున్నారు. అభిమానుల్లోనూ అదే భావన వ్యక్తమైంది. జనసేన బలమెంతో అవగాహన లేకుండా చేసిన ఇలాంటి ప్రచారాలను మొదట్లోనే ఖండించాల్సింది. తర్వాత పవర్ షేరింగ్​ పద్దతంటూ జన సైనికుల నుంచి ప్రతిపాదన ముందుకొచ్చింది. వీటన్నింటినీ పవన్​ చివరిదాకా నిరోధించలేదు. ఇప్పుడు తొలి జాబితాలో 24 సీట్లు కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈపాటికే నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశించి పార్టీని పోషిస్తున్న నాయకులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తట్టుకోలేక నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామంటుంటే.. ఇంకొందరు వైసీపీ వైపు తొంగి చూస్తున్నట్లు తెలుస్తోంది.

నిరసనలు ఆగుతాయా..

చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలతో టీడీపీ బలం పెరిగిందని ఆ పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేసిన విజయం సాధించగలమనే ధీమాతో ఉన్నారు. జనసేనతో పొత్తు ఉంటుందని చంద్రబాబు ఏడాది నుంచే సంకేతాలు ఇస్తున్నారు. ఒకట్రెండు సార్లు చంద్రబాబు, పవన్​ కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. అదే జరిగి ఉంటే ఇరు పార్టీల్లో కలివిడితనం పెరిగేది. క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేయడం ద్వారా విభేదాలకు తావుండేది కాదు. ఎన్నికలు దగ్గర పడ్డాక సీట్ల సర్దుబాటుతో ఎవరికి వాళ్లు కాలు దువ్వే పరిస్థితి తలెత్తింది. అప్పటికీ చంద్రబాబు టిక్కెట్​ దక్కని నేతలను పిలిపించి బుజ్జగిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించే ఉమ్మడి సభతో చాలావరకు నిరసనలకు ఫుల్​ స్టాప్​ పడుతుందని ఇరుపార్టీల వర్గాలు భావిస్తున్నాయి.

ఓట్ల బదిలీ కష్టమే..

బీజేపీతో పొత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఐదు ఎంపీ, మరో ఐదు అసెంబ్లీ స్థానాలు కేటాయించవచ్చనే ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. అందుకు ఢిల్లీ పెద్దలు అంగీకరిస్తారో లేదో తెలీదు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే స్థానాల్లో టీడీపీ, జనసేన నుంచి ఎలాంటి ఎదురుదాడి ఎదురవుతుందోనని ఆ పార్టీ నేతలు కలవరపడుతున్నారు. బీజేపీ అంటే టీడీపీ శ్రేణులు ఒంటికాలి మీద లేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ కత్తిమీద సామే అవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

సందట్లో వైసీపీ సోషల్ మీడియా..

పొత్తుల ఇరకాటంలో టీడీపీ, జనసేన తలమునకలవుతుంటే వాళ్ల మధ్య చిచ్చు పెట్టే పనిలో వైసీపీ సోషల్​ మీడియా నిమగ్నమైంది. ‘24 సీట్లకు ఏకీభవించండి.. లేదా వైసీపీకి వెళ్లిపోండి’ అంటూ పవన్​ కల్యాణ్​ హుకుం జారీ చేసినట్లు జనసేన పార్టీ లెటర్​ హెడ్​తో విడుదల చేసిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తోంది. ప్రధానంగా వైసీపీ ఫేస్​ బుక్​ గ్రూపులు ఈ ప్రకటనను తెగ వైరల్​ చేస్తున్నాయి. వైసీపీ రెచ్చగొట్టే నకిలీ ప్రకటనలను నమ్మొద్దని జనసేన నేతలు ఆ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాడేపల్లి గూడెం ఉమ్మడి సభను విజయవంతం చేయడం ద్వారా అన్నీ అసంతృప్తులకు చెక్​ పెట్టాలని ఇరు పార్టీల అధినేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.



Next Story

Most Viewed