మొండికేసిన నీటి ప్రవాహం.. ఆందోళన చెందుతున్న రైతులు

by Disha Web Desk 7 |
మొండికేసిన నీటి ప్రవాహం.. ఆందోళన చెందుతున్న రైతులు
X

ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలతో రెండో పంటకు మొగ్గు చూపిన రైతులు.. ఇప్పుడు ఆందోళనలో మునిగిపోయారు. కేసీ ఆనకట్టు పరిధిలో పది రోజులుగా నీటి ప్రవాహం తగ్గడంతో చివరి ఆయకట్టు భూములకు నీరందడం లేదు. మరో వైపు నీటి ప్రవాహం తగ్గడం కారణంగా ఎప్పుడు నీటి విడుదల ఆపేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. నెలాఖరు వరకైనా నీరిస్తేనే పంటలు బతకగలవని రైతులు అంటున్నారు.

దిశ ప్రతినిధి, కడప: కర్నూలు-కడప (కేసీ) ఆయకట్టు పరిధిలో పది రోజులుగా తగినంతగా నీరు రావడం లేదు. జిల్లా సరిహద్దుల్లోని రాజోలి ఆనకట్ట ద్వారా ఒక వైపు ప్రధాన కాలువకు ఒక వెయ్యి క్యూసెక్కులు, మరో వైపు చాపాడు ఛానల్ కు 200 క్యూసెక్కుల నీరు విడుదల కావాల్సి ఉంది. అయితే గత పది రోజుల నుంచి కుందూనదిలో నీటి ప్రవాహం తగ్గింది. ఆ కుందూనది నుంచి రాజోలి ఆనకట్ట ద్వారా విడుదల కావాల్సిన నీటి ప్రవాహం కొంత మేర ఆగింది. అటు ప్రధాన కాలువకు 150 నుంచి 200 క్యూసెక్కులు, ఇటు చాపాడు ఛానల్ కు 50 నుంచి 70 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలవుతోందని రైతులు పేర్కొంటున్నారు.

చివరికి అందని నీరు

కాలువ నీరు చివరి ఆయకట్టుకు చేరడం లేదు. కేసీ కెనాల్, దాని అనుబంధ చాపాడు చానల్ కింద దాదాపు 20 వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. ఒక చాపాడు మండల పరిధిలోనే సుమారు ఐదు వేల ఎకరాల్లో పంటలు ఉన్నాయి. కాలువ కింద జిల్లాలోని దువ్వూరు, చాపాడు, ప్రొద్దుటూరు, రాజుపాళెం, మైదుకూరు, ఖాజీపేట, చెన్నూరు, కడప ప్రాంతాల్లో ఈ ఏడాది ఎండా కాలంలో రెండో పంటలు వేశారు. ఇందులో వరి పంటను ఎక్కువ భాగం సాగైంది. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ ఏడాది మే వరకు సాగు నీరు వస్తుందని నమ్మి పంటలు సాగు చేశామని రైతులు చెబుతున్నారు.

స్పష్టత లేదు

ఆగస్టు రెండో వారంలో ప్రభుత్వం అధికారికంగా కేసీకి సాగు నీటిని విడుదల చేసింది. ఆ నీరు డిసెంబర్ చివరి వరకు కొనసాగించి నిలుపుదల కావాల్సి ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉందని నీటి సరఫరాను అధికారులు కొనసాగిస్తూ వచ్చారు. ఎంత కాలం వరకు ఈ నీటి సరఫరా చేస్తారన్నది అధికారులు స్పష్టం చేయలేదు. ఒకటి, రెండు సార్లు మైదుకూరు శాసన సభ్యులు ఎస్ రఘురామిరెడ్డి మాత్రం మార్చి చివరి వరకు సాగు నీరు వస్తుందని తెలిపారు.

15వ తేదీ వరకేనా ?

గత రెండేళ్లుగా ఏప్రిల్ చివరి వరకు సాగు నీరు సరఫరా చేశారు. దీనికి తగినట్టుగానే రైతులు ఈ ఏడాదీ పంటలు వేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి పూర్తి స్థాయిలో నీటి సరఫరా ఆగిపోయింది. దిగువన ఉన్న ఎస్ఆర్‌బీసీ, గోరుకల్లు తదితర జలాశయాల నుంచి కొద్దిగా నీటి సరఫరా అవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. అతికష్టం మీద ఈ నెల 15వ తేదీ వరకు సాగు నీరు సరఫరా అవుతుందని, ఆ తర్వాత నీటి సరఫరా కష్టమేనని కేసీ కెనాల్ డివిజనల్ ఇంజనీర్ బ్రహ్మారెడ్డి చెబుతున్నారు.

ఇదే జరిగితే సాగులో ఉన్న వేలాది ఎకరాల వరి, నువ్వు పంటలు గట్టెక్కే పరిస్థితి ఉండదని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని నేతలు, అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేసీ కెనాల్ కింద పంటలు దెబ్బతినకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత వంతులవారీగా రెండు, మూడు తడులకయినా నీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు, రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



Next Story

Most Viewed