Ongole: దమ్ముంటే చర్చకు సిద్ధమా.. బాలినేనికి దామచర్ల సవాల్​

by Disha Web Desk 16 |
Ongole: దమ్ముంటే చర్చకు సిద్ధమా.. బాలినేనికి దామచర్ల సవాల్​
X

దిశ, దక్షిణ కోస్తా: టీడీపీ హయాంలోనే ముస్లింలకు మేలు జరిగిందని, మత పెద్దల హయాంలో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దనరావు సవాల్​ విసిరారు. ఒంగోలులో ముస్లింల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు మూడొందల ముస్లిం కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పని చేసిన బాలినేని ముస్లింలకు ఒరగబెట్టిందేంటని నిలదీశారు. టీడీపీ హయాంలోనే ముస్లింలకు మైనార్టీ కార్పొరేషన్​ ద్వారా రుణాలు, రంజాన్​ తోఫా, దుల్హన్​ పథకం, షాదీఖానాల నిర్మాణం, ఈద్గా అభివృద్ధి పనులు జరిగినట్లు ఆయన గుర్తు చేశారు. ఏ సమస్య వచ్చినా.. ఎవరు బెదిరించినా నేరుగా వచ్చి తనను కలవాలని దామచర్ల భరోసా ఇచ్చారు.

జీ ప్లస్ టూ గృహాలు మంజూరు కాని వాళ్లకు నగదు తిరిగి ఇచ్చేందుకు నగర కమిషనర్​ ఎమ్మెల్యే బాలినేని సంతకం కావాలనడం విడ్డూరంగా ఉందని దామచర్ల విమర్శించారు. ప్రజల డబ్బు చెల్లించేందుకు ఎమ్మెల్యే సంతకం ఎందుకని దామచర్ల నిలదీశారు. 24వ డివిజన్ కోటవీధి వారికి చెందిన షాపుల కూల్చివేతలో తన ప్రమేయం ఉందని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. షాపుల కూల్చివేత అనంతరం తానువెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పిన సంగతిని దామచర్ల గుర్తు చేశారు. పదేపదే అబద్ధాలు చెప్పి ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడం సరికాదని బాలినేనికి హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముస్లింలకు రెండో శ్మశాన వాటిక కోసం స్థలాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బాలినేని మాయమాటలు ఒంగోలు నియోజక ప్రజలు ఇక నమ్మరని.. ఆయనకు ఇవే చివరి ఎన్నికలని దామచర్ల పేర్కొన్నారు.



Next Story

Most Viewed