Former Minister Pithani : విశాఖ సమ్మిట్ అంతా అభూత కల్పన

by Disha Web Desk 16 |
Former Minister Pithani : విశాఖ సమ్మిట్ అంతా అభూత కల్పన
X

దిశ,డైనమిక్ బ్యూరో: విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ అంతా అభూత కల్పనేనని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి లక్షలాది కోట్ల నిధులు తరలివచ్చాయంటూ ప్రభుత్వం చెప్తున్న లెక్కలన్నీ అంకెల గారడీలు, అవాస్తవాలేనని ఆయన ఆరోపించారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు అంటూ రాష్ట్ర ప్రజలను, యువతను ప్రభుత్వం మభ్యపెడుతోందని విమర్శించారు. పెట్టుబడుల విషయంలో ఈ నాలుగేళ్లు ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మెళుకువ వచ్చి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తారా అని నిలదీశారు. సమ్మిట్ అనేది వచ్చే ఎన్నికల కోసం చేసిన స్టంట్ అంటూ విమర్శించారు.

ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి..?, ఏయే పరిశ్రమలు వచ్చాయి?, ఏ కంపెనీలు ఎంవోయూ చేసుకున్నాయి?, వాటి కాల పరిమితి ఎంత? ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం బయటపెట్టాలని పితాని సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పాలి గానీ తప్పుడు లెక్కలు చూపించకూడదని మాజీమంత్రి పితాని సత్యనారాయణ హితవు పలికారు.

Next Story

Most Viewed