పవన్ కల్యాణ్ సెన్స్ బుల్ పర్సన్ కాదు కానీ.. : మంత్రి సీదిరి అప్పలరాజు

by Disha Web Desk 21 |
Minister Sidiri Appalaraju
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెన్స్ బుల్ పర్సన్ కాదు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఆయనకు స్థిరత్వం లేదన్నారు. పూటకో మాట రోజుకో నాటకంలా.. ఆయన వ్యవహరించడం ప్రజలంతా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో ఆనాడు ఐవైఆర్‌ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి..?’ పుస్తకాన్ని ఆవిష్కరించింది పవన్ ‌కల్యాణ్ కాదా..? గూగుల్‌లో వెదికితే అసలు నిజం తెలుస్తోంది అని చెప్పుకొచ్చారు. మరి ఈరోజు అదే అమరావతి పవన్‌ కల్యాణ్‌కు ముచ్చటైన వేదికగా కనిపిస్తుందా..? అని నిలదీశారు. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు.. ఆయన చేసిన పాపాలే ఇప్పుడు పవన్ ‌కల్యాణ్‌నూ చుట్టుముడుతున్నాయని చెప్పుకొచ్చారు. నేడు చంద్రబాబు మీద ఈగ వాలనీయకుండా.. సొంతకొడుక్కి లేని నొప్పి పవన్ ‌కల్యాణ్‌కి కలుగుతుంది కనుకే ఆయన్ను దత్తపుత్రుడు అని తాము అంటున్నట్లు చెప్పుకొచ్చారు. జనసేన పార్టీని పవన్ కల్యాణ్ అమ్మేశాడని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తించాలి అని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు.

సొంత బ్రెయిన్ వాడితే నిజాలు తెలుస్తాయి

జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ పేరుకు జనసేన పార్టీలో ఉన్నప్పటికీ.. ఆయన రిలీజ్‌ చేసే ప్రకటనలేమో టీడీపీ నుంచి అందుతున్నాయేమోనని మంత్రి సీదిరి అప్పలరాజు సందేహం వ్యక్తం చేశారు. ఒకపక్కన తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు అంటారు. మరోవైపు ఆంధ్రకొచ్చేసరికి టీడీపీ నుంచి వచ్చిన స్క్రిప్టును బట్టీబడుతూ వారి చేతుల్లోనే ఇమిడిపోతున్నారు అని విమర్శించారు. నాదెండ్ల మనోహర్‌ సొంత బ్రెయిన్‌ వాడితే నిజాలు తెలుస్తాయంటూ ఎద్దేవా చేశారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఒక యజ్ఞంలా కొనసాగిస్తోన్న సంక్షేమ కార్యక్రమాల్లో ఆసరా, చేయూత విజయవంతంగా అమలవుతూ మహిళా సాధికారతకు బాటలు వేస్తోందని చెప్పుకొచ్చారు. జగనన్న చేయూత కింద ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,92,911 పశువులను మహిళలతో కొనుగోలు చేయించడం జరిగింది. ఈ వాస్తవాన్ని గమనించాలని, మహిళలకు పశుసంవర్ధక శాఖ నుంచి ఏమీ అందలేదంటున్న మనోహర్‌కు ఈ విషయాలు తెలుసుకోవాలని సూచించారు. మహిళా సాధికారత విషయంలో మీ మాటలు మహిళల్ని, ప్రభుత్వాన్ని అవమానించే విధంగా ఉన్నాయని.. కనుక మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలని నాదెండ్ల మనోహర్‌ని మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed