బుజ్జగింపులు ‘‘ఫెయిల్’’.. మీడియా కంటపడకుండా వెళ్లిపోయిన బాలినేని..!?

by Disha Web Desk 19 |
బుజ్జగింపులు ‘‘ఫెయిల్’’.. మీడియా కంటపడకుండా వెళ్లిపోయిన బాలినేని..!?
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్​ పదవికి రాజీనామా చేశారు. దీనిపై పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా బాలినేనితో రాయబారాలు నడిచాయి. సీఎం జగన్‌తో ఓసారి ముఖాముఖి కలిస్తే సమస్యలన్నీ టీ కప్పులో తుపానులాగా పోతాయని భావించారు. దీంతో మంగళవారం బాలినేని హైదరాబాద్​నుంచి ఫ్లయిట్‌లో విజయవాడ వచ్చారు. నేరుగా తాడేపల్లి వెళ్లి సీఎంను కలిశారు. లోపల ఏం జరిగిందో తెలీదు. మీడియా కంటపడకుండా బాలినేని తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

సమస్య అదే..

మంత్రి వర్గ విస్తరణలో సీఎం జగన్.. తన మామయ్య వరుసైన బాలినేనికి తదుపరి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన కినుక వహించారు. అంతేగాదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏ ఒక్క విషయంలోనూ బాలినేని సూచనలను ముఖ్యమంత్రి పరిగణనలోకి తీసుకోలేదు. రెండో సారి ఆదిమూలపు సురేశ్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని బాలినేని జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తయితే మరోవైపు ఆయన్ని జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తప్పించి తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సమన్వయకర్తగా నియమించారు. దీంతో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్​చార్జులు బాలినేనిని లెక్కచేయడం లేదనే భావనకు వచ్చారు. ఇది బాలినేనిలో మరింత ఉక్రోషాన్ని నింపింది.

బాలినేనిపై ఎమ్మెల్యేల ఫిర్యాదు?

బాలినేని కుటుంబంపై వరుసగా అవినీతి, భూకబ్జాల ఆరోపణలు రావడం సీఎం జగన్​దగ్గర ఆయన ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. సమన్వయకర్తగా ఇతర జిల్లాల బాధ్యతలను అప్పగిస్తే ఆయన సక్రమంగా విధులు నిర్వహించలేదనే అపవాదును మూటగట్టుకున్నారు. నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడడమే అందుక్కారణమంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బాలినేని లేనిపోని సమస్యలను సృష్టిస్తున్నారంటూ ఆయా ఎమ్మెల్యేలు సీఎం జగన్​దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో బాలినేని రాజీనామా చేశారనే వార్తలు వెలువడినా ఆయనకు మద్దతుగా ఏ ఒక్క ఎమ్మెల్యే ముందుకు రాలేదు.

జగన్ ఇక ఉపేక్షించరా..?

ప్రస్తుతం వైసీపీని బోలెడు సమస్యలు వేధిస్తున్నాయి. ఓవైపు వివేకా హత్య కేసు ఊపిరి సలపనివ్వడం లేదు. ఇంకోవైపు కోడి కత్తి కేసులోనూ జగన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు సంక్షేమ పథకాలకు అప్పులు పుట్టడం గగనమైంది. అప్పుల కోసం అనుమతులకు వెళ్లినప్పుడల్లా కేంద్రం పలు ఆంక్షలు పెడుతోంది. ఇవన్నీ సీఎం జగన్‌ను నిరంతరం చికాకు పెడుతున్నాయి.

ఇలాంటి సమయంలో బంధువైన బాలినేనిని అంత తేలిగ్గా వదులుకోరంటూ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. అదే సందర్భంలో బాలినేనిని సీఎం ఇక ఉపేక్షించరనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ తాడేపల్లి నివాసంలో సీఎం జగన్, బాలినేని మధ్య ఏం చర్చలు జరిగాయనేది బయటకు రాలేదు. బాలినేనికి కాల్​చేసినా స్పందించడం లేదు. దీంతో ఎవరికి తోచినట్లు ఊహించుకుంటున్నారు. ఇరువురి మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: బిగ్ న్యూస్: మహారాష్ట్రపై కన్నేసిన KCR.. BRS బలోపేతానికి గులాబీ బాస్ నయా వ్యూహం!



Next Story

Most Viewed