పేదలకు వైద్యం.. ఉత్తమాటేనా?

by Dishanational2 |
పేదలకు వైద్యం.. ఉత్తమాటేనా?
X

దిశ, పిఠాపురం : సాధార‌ణంగా ప్ర‌భుత్వాసుప‌త్రి అంటే అంతా ఫ్రీగా జ‌రుగుతాయ‌ని అనుకుంటారు. కానీ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సేవలపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వస్తున్నాయి. చాలీచాల‌ని మందులు, అర‌కొర సేవ‌లతో పేదలు అల్లాడిపోతున్నారు. దాదాపుగా మందులన్నీ రోగులు బయట కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. స‌ర్జ‌రీ చేయించుకోవ‌డానికి ఎవ‌రైనా వ‌స్తే అందుకు అవసరమైన సామాగ్రి అంతా రోగి కుటంబీకులు తెచ్చుకోవాల్సిందే. పిఠాపురం ప‌ట్ట‌ణంతోపాటు, దాదాపుగా చుట్టుక‌ప‌క్క‌ల ఉన్న 10 గ్రామాల‌కు ఇదే పెద్దాసుప‌త్రి.

మూల‌కు చేరిన అంబులెన్స్

పిఠాపురం, పెద్దాపురం పురపాలక సంఘాల్లోని సామాజిక ఆరోగ్య కేంద్రాలకు రోగుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా వీటి పరిధిలో జాతీయ రహదారులు ఉండడంతో తరచూ రోడ్డు ప్ర‌మాదాలు జ‌ర‌గుతున్నాయి. బాధితులకు అత్యవసర చికిత్స అందించాల్సి ఉన్నా, 108 వాహ‌నం రాక‌పోతే ఇక న‌ర‌క‌మే. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. గతంలో ప్రభుత్వ అంబులెన్సులు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అందుబాటులో ఉంచారు. ఈ వాహనాలకు గతంలో డ్రైవర్లను కూడా నియమించారు. కానీ సదరు వాహ‌నం మూల‌కు చేరడంతో స‌మ‌స్య మొద‌టికొచ్చింది. పిఠాపురం ప‌రిస‌ర ప్రాంతంలో పెద్ద ప్ర‌మాదంతో జ‌రిగితే ఆసుప‌త్రి బ‌య‌ట ఉండే ప్రైవేటు వాహ‌నాల‌పైనే ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. పిఠాపురం నుంచి సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాకినాడలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లాలంటే రూ.2. వేల నుంచి రూ.5 వేల వరకూ కిరాయి తీసుకుంటున్నారు.

బ‌య‌ట మందులే దిక్కు

ప్ర‌భుత్వం నుంచి మందులు స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌డంతో రోగులు తీవ్ర ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. జ్వ‌రం, గ్యాస్ట్రీక్ మాత్ర‌లు, ఇత‌ర‌నొప్పుల మాత్రలు త‌ప్పితే, మిగతా రోగాలకు సంబంధించి అవ‌స‌ర‌మైన మందులు అందుబాటులో లేవు. చేసేది లేక వైద్యులు కొన్ని మాత్రలు బ‌య‌ట తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. నిరుపేదలకు మందుల‌ను బ‌య‌టే కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక శ‌స్త్ర‌చికిత్స‌లకైతే అవ‌స‌ర‌మైన కిట్లు కూడా బ‌య‌ట తీసుకుంటున్నామ‌ని రోగులు చెబుతున్నారు. ప్ర‌భుత్వం నుంచి స‌ర‌ఫ‌రా లేకపోవడంతో ఆసుప‌త్రి వ‌చ్చే రోగుల‌కు అన్ని బయట మందుల షాపులపైనే ఆధారపడాల్సి వస్తుంది. ర‌క్త‌ప‌రీక్ష‌ల‌ను ప్రైవేటు లేబొరేటరీలపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొని ఉంది.

Next Story

Most Viewed