మడకశిర టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెస్ రాజు..!

by Disha Web Desk 12 |
మడకశిర టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెస్ రాజు..!
X

దిశ ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని పార్టీ అధిష్టానం మార్పు చేసింది. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజుకు అవకాశం కల్పించింది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన ఈ స్థానం నుంచి తొలుత మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని ఆ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినా, తొలి జాబితాలోనే సునీల్ పేరు ప్రకటించడంతో ఆయన ప్రచారం ఎప్పుడో ప్రారంభించారు. ఈ దశలో అభ్యర్థిని మార్చి ఎమ్మెస్ రాజుకు బీ ఫారం ఇవ్వడాన్ని సునీల్ కుమార్ వర్గీయులు తీవ్రంగా నిరసించారు. మడకశిర పార్టీ కార్యాలయంలోని ఫ్లెక్సీలు, జెండాలను బయట పడేసి తగుల పెట్టారు. చంద్రబాబు ఫొటోలను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. సీబీఎన్ డౌన్ డౌన్, ఎమ్మెస్ రాజు గో బ్యాక్ అంటూ నినదించారు. రెబల్ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేయనున్నట్టు సునీల్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం ఏర్పడింది.

ఎంపిక ఎలా జరిగింది?

అనంతపురం జిల్లా శింగనమల మండలానికి చెందిన ఎమ్మెస్ రాజు తొలుత ఎమ్మార్పీఎస్ ఉద్యమంతో ప్రజా ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం టీడీపీలో చేరి ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. లోకేష్ జట్టులో సభ్యుడిగా ఉంటూ యువగళం పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆయనకు అనంతపురం జిల్లా శింగనమల నుంచిగానీ, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నుంచి గానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం రావచ్చునని ప్రచారం జరిగింది. అయితే ఆ రెండు స్థానాలకూ అభ్యర్థులు ఖరారైన వాటిలో మాత్రం ఆయన పేరు లేదు. తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఆయనకు బాపట్ల ఎంపీ టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు తొలుత నిర్ణయించారు. అయితే, టికెట్ ప్రకటించే లోపే ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ వచ్చి తన్నుకుపోయారు. తర్వాత తాడికొండ అసెంబ్లీ స్థానానికి కూడా రాజు పేరు పరిశీలించారు. అయితే అవేవీ వర్కౌట్ కాలేదు.

సునీల్ ను ఏం చేస్తారు ?

మడకశిరలో సునీల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఆ నియోజకవర్గ ఇన్చార్జి గుండుమల తిప్పేస్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తుండడాన్ని అవకాశంగా రాజు మలుచుకున్నారు. ఒకవైపు గుండుమల సహకారం తీసుకోవడం, మరో వైపు మందకృష్ణ మాదిగ, వర్ల రామయ్య వంటి వారితో లాబీయింగ్ చేయించడం ద్వారా తాను అనుకున్నది సాధించుకోగలిగారు. ఇప్పుడు పార్టీ పెద్దల ద్వారా సునీల్ కుమార్ ని బుజ్జగించి ఆయన వర్గీయులు సహకరించేలా చేసుకోగలగడం ఎమ్మెస్ రాజు ముందున్న అతిపెద్ద టాస్క్ గా చెప్పవచ్చు.



Next Story

Most Viewed