గుంటూరు గుండెల్లో నిలిచేలా.. రైల్వే వంతెన నిర్మాణంపై మంత్రి రజని దృష్టి

by Disha Web Desk 2 |
గుంటూరు గుండెల్లో నిలిచేలా.. రైల్వే వంతెన నిర్మాణంపై మంత్రి రజని దృష్టి
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి విడదల రజని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా శంకర్ విలాస్ వద్ద రైల్వే వంతెన ట్రాఫిక్ సమస్య సృష్టిస్తోంది. దీన్ని పున:నిర్మించాలి. అస్తవ్యస్తంగా మారిన భూగర్భ మురుగునీటి పారుదలను సరిచేయాలి. శివారు ప్రాంతాలను వేధిస్తోన్న మంచినీటి కొరతను పరిష్కరించాలి. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వీటినే నియోజకవర్గ మేనిఫెస్టోగా ప్రకటించాలని భావిస్తున్నారు.

“ఇప్పటిదాకా సీఎం వైఎస్ జగన్​ మోహన్ రెడ్డి నాయకత్వంలో నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైసీపీ ప్రభుత్వం కృషి చేసింది. ఇక్కడ నుంచి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు నియోజకవర్గాల వారీ ఏం చేయాలనే దానిపై పార్టీ ఆలోచిస్తోంది. అందులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేస్తున్నాం. మళ్లీ అధికారానికి వచ్చాక దశలవారీ ఏమేం చేయగలమనేది ప్రజల ముందు ఉంచదల్చుకున్నాం !”అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వెల్లడించారు.

భూగర్భ నీటి పారుదల వ్యవస్థపై ప్రణాళిక

గుంటూరు నగరంలో రూ.840 కోట్ల వ్యయంతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ పనులు ముక్కలు ముక్కలుగా చేపట్టడం వల్ల మురుగునీరు సాఫీగా వెళ్లడం లేదు. భారీ వర్షాల సమయంలో ఎక్కడికక్కడ డ్రెయినేజీ పొంగి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. డ్రెయినేజీ కోసం రోడ్డు మధ్యలో తవ్విన గుంతలు సక్రమంగా పూడ్చలేదు. గతేడాది వర్షాకాలం బైక్​ మీద వెళ్తూ గుంతల్లో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల అండర్​ గ్రౌండ్ డ్రెయినేజీలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో వాటిని సరి చేయాల్సి ఉంది.

రైల్వే బ్రిడ్జి కోసం కసరత్తు

శంకర్​ విలాస్​ వద్ద రైల్వే వంతెన నిర్మాణానికి ఏడేళ్ల క్రితమే ప్రతిపాదించారు. రూ.550 కోట్ల వ్యయంతో రైల్వే, కార్పొరేషన్, ఆర్ అండ్​బీ శాఖల సమన్వయంతో మరింత వెడల్పుగా ట్రాఫిక్​ రద్దీని తట్టుకునేట్లు కొత్త వంతెన నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా ఈ మూడు శాఖల మధ్య పొసగడం లేదు. ట్రాఫిక్​ ఇబ్బందుల దృష్ట్యా దీనిపై మూడు శాఖలు చొరవ తీసుకోవాలని ఇటీవల నగర కార్పొరేషన్​ చైర్మన్ కావటి మనోహర్​ నాయుడు, ఎమ్మెల్యే మద్దాళి గిరి ఆయా శాఖల ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా ఇంత వరకు వంతెన నిర్మాణానికి అడుగు ముందుకు పడలేదు.

మంచినీటి కొరతకు చెక్ పెట్టేలా..

నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల్లో మంచి నీటి కొరత వేధిస్తోంది. నగర విస్తరణకు తగ్గట్లు పైపు లైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఎక్కడెక్కడ అవసరమనే దానిపై మంత్రి రజని ఆరా తీస్తున్నారు. ఇంకా జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీల జీవన ప్రమాణాలు పెంచడానికి ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. యువతకు ఉద్యోగావకాశాలు, స్వయం ఉపాధి కోసం ప్రణాళికను రూపొందిస్తున్నారు. వీటన్నింటినీ నియోజకవర్గ మేనిఫెస్టోలో ప్రకటించి దశలవారీ అమలు చేస్తామని మంత్రి రజని భరోసా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed