జిల్లా అభివృద్ధికి పెద్దపీట.. ఆర్థిక మంత్రి బుగ్గన

by Dishafeatures2 |
జిల్లా అభివృద్ధికి పెద్దపీట.. ఆర్థిక మంత్రి బుగ్గన
X

దిశ, కోడుమూరు : జిల్లా అభివృద్దికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. నియోజక వర్గంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.21 కోట్లతో చేపట్టనున్న గోరంట్ల-కొత్తపల్లి హైలెవెల్ బ్రిడ్జికి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, స్థానిక కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు, నగర మేయర్ బీవై.రామయ్య, కుడా చైర్మన్ కోట్ల హర్ష వర్థన్ రెడ్డి, పీఆర్ ఎస్ఈ సుబ్రమణ్యంతో కలిసి మంత్రి బుగ్గన మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017 నవంబర్ 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హంద్రీ నదిపై పాదయాత్ర చేస్తూ ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి హామీచ్చారన్నారు. ఈ హామీ మేరకు ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నిర్మాణాన్ని ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు.

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ బ్రిడ్జి పూర్తైతే కోడుమూరు, క్రిష్ణగిరి మండలాల్లోని 20 గ్రామాల ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడి నుంచి పరిపాలించిన నేతలు ఈ సమస్యను పరిష్కరించలేదని ప్రస్తుతం తమ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. నియోజక వర్గ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యే సుధాకర్ ఆమడగుంట్ల గ్రామం నుంచి గోరంట్ల వరకు దాదాపు 8 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రఘునాథరెడ్డి, ఎంపీపీ రుతమ్మ, తహసీల్దార్ శేషఫణి, ఎంపీడీఓ చంద్రశేఖర్, గోరంట్ల సర్పంచ్ బాలకృష్ణ, వైసీపీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, లాయర్ ప్రభాకర్, యమడగుంట్ల భీమ్ రెడ్డి, మోదిన్ తదితరులు పాల్గొన్నారు.


మరోసారి బయటపడ్డ విభేదాలు.. ఎడమొహం పెడమొహంగా ఎమ్మెల్యే, కోట్ల హర్ష

కోడుమూరు నియోజక వర్గంలోని వైసీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నాయకులందరు కలిసి పని చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించినా ఇక్కడి నాయకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మంగళవారం గోరంట్ల-కొత్తపల్లి హంద్రీ నదిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్ లు ఎడమొహం పెడమొహంగా కనిపించారు. కనీసం మాట మాత్రంగానైనా పలకరించుకోలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కన్పించారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కోట్ల హర్ష వర్గీయులు పాల్గొనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కోట్ల హర్షవర్ధన్ రెడ్డితో పాటు కోడుమూరు జెడ్పీటీసీ రఘునాథరెడ్డి, ఎంపీపీ రుతమ్మ, గూడూరు ఎంపీపీ సునీత, ప్రతాప్ రెడ్డిలు భూమి పూజ చేయగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. బహిరంగ సభలో పాల్గొనాలని పిలిచినా అక్కడ లేకపోవడం చూస్తుంటే విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎంపీ సంజీవ్ కుమార్, వైసీపీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీవై.రామయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డిలు ఉన్నా వారిని కలిపే ప్రయత్నం చేయకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. విభేదాలు ఇలాగే కొనసాగితే పార్టీ బలహీనపడే అవకాశం ఉందని పార్టీలో చర్చించుకుంటున్నారు.



Next Story