రేపు ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

by Disha Web Desk 2 |
రేపు ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రేపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 18న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేయగా ఆయన గైర్హాజరయ్యారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్య పరిస్థితి బాగాలేకపోవడం వల్ల విచారణకు రావడం లేదని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన న్యాయమూర్తుల ద్వారా ఈడీ అధికారులకు సమాచారం పంపించారు. దీంతో, ఆయన రిక్వెస్టుకై ఈడీ మరోతేదీని సూచించింది. రేపు విచారణకు హాజరుకావాలంటూ మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. తమ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్ళైతో కన్‌ఫ్రంటేషన్ విధానంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రశ్నించాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు ఇవాళ విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ వ్యవహారంలో కవిత బినామీగా వ్యవహరించిన అరుణ్ పిళ్లయ్‌తో కలిపి కవితను కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో రెండు గంటలకు పైగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. అనంతరం పిళ్లయ్‌ని ఈడీ కోర్టుకు తరలించగా.. 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టై తిహార్ జైల్లో ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొడుకు, మాగుంట రాఘవ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీని శనివారం స్పెషల్ కోర్టు మరో 10 రోజులు పొడిగించింది. దీంతో, మార్చి 28 వరకు రాఘవరెడ్డి కస్టడీలో ఉండనున్నారు.


Next Story

Most Viewed