Atrocious Incident: భార్య కాపురానికి రాలేదని తండ్రిని చంపిన కుమారుడు

by srinivas |
Atrocious Incident: భార్య కాపురానికి రాలేదని తండ్రిని చంపిన కుమారుడు
X

దిశ, నందికొట్కూర్: కన్న తండ్రిని కుమారుడు అతికిరాతకంగా హత్య చేసిన దారుణ సంఘటన నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పడమర పాతకోటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లె వెంకటేశ్వర్లు(50)ను కుమారుడు శ్రీకాంత్ ఇనుపరాడ్‌తో కొట్టి చంపేశాడు. అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.

పడమర పాతకోటకు చెందిన పల్లె వెంకటేశ్వర్లు, రమణమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ బైక్ మెకానిక్. శ్రీకాంత్‌కు జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు చెందిన యువతితో ఆరు ఏళ్ల క్రితం వివాహామైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే వీరి కుటుంబంలో కలహాలు చెలరేగాయి. దంపతులు తరచూ గొడవలు పడేవారు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులపై శ్రీకాంత్ కోపం పెంచుకున్నాడు. తండ్రి వెంకటేశ్వర్లుతో గొడవపడ్డాడు. బైక్ రాడ్‌తో తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో తండ్రి నెలకొరిగాడు. తల పగిలి ప్రాణాలు కోల్పోయాడు.

అనంతరం తల్లి వద్దకు వెళ్లి నాన్నను చంపేశానని చెప్పాడు. కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లి చూడగా వెంకటేశ్వర్లు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. ముచ్చుమర్రి పోలీసులకు సమాచారం అందించారు. కొన ఉపిరితో ఉన్నదేమోనన్న ఆశతో నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే వెంకటేశ్వర్లు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. నేరాన్ని ఒప్పుకుంటూ శ్రీకాంత్ ముచ్చుమర్రి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.

Next Story

Most Viewed