AP Politics:రానున్న ఎన్నికల్లో పెత్తందారుల ఓటమి తప్పదు - సీఎం జగన్

by Disha Web Desk 18 |
AP Politics:రానున్న ఎన్నికల్లో పెత్తందారుల ఓటమి తప్పదు - సీఎం జగన్
X

దిశ ప్రతినిధి,కృష్ణా జిల్లా: తన మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల్లో పెత్తందారుల ఓటమి తప్పదు అని, ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర కృష్ణా జిల్లాలో రెండో రోజు కొనసాగింది. గన్నవరం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర హనుమాన్ జంక్షన్ మీదుగా గుడివాడ చేరుకుంది. నాగవరప్పాడులో మేమంతా సిద్ధం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పై రాళ్లు విసిరి నుదుటిపై గాయం చేశారని, నా నుదుటిపై గాయం పది రోజుల్లో తగ్గుతుందని, చంద్రబాబు హయాంలో చేసిన పాపాలు, మోసాలు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరన్నారు.

గాయపరచడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజంగా పేర్కొన్న జగన్ ప్రజలకు మంచి చేయడమే నా నైజం అని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ప్రజలను సముద్రంగా అభివర్ణించిన జగన్ మే 13 జరగనున్న మహాసంగ్రామంలో మంచి వైపు నిలబడి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. తన తరఫున ప్రజలే స్టార్ హీరోలని నాకు ఎటువంటి హీరోలు అవసరం లేదన్నారు. అబద్దాలతో కోటలు కట్టిన వారంతా తనపై మూకుమ్మడిగా యుద్ధానికి పాల్పడుతున్నారని ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ అనే వ్యక్తి అదరడు బెదరడు అనే విషయాన్ని రానున్న కాలంలో వారికే అర్థం అవుతుందన్నారు. ప్రజలు అనే శ్రీకృష్ణుడు ఉన్నంతకాలం అర్జునుడిగా నేను యుద్ధం చేస్తానన్నారు.

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆదివారం జరగాల్సిన సభ ఉమ్మడి కూటమి కుట్రల వల్ల సోమవారం జరిగిందన్నారు. సీఎంను ఆశీర్వదించడానికి వేలాదిమంది మేమంతా సిద్ధం సభకు రావడం ఆనందంగా ఉందని, స్కూలుకు వెళ్లే పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు జగన్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారన్నారు. గ్రామ గ్రామాన, వార్డు వార్డున సచివాలయంలో ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అనేకమంది నిరుపేదలను కాపాడిన వ్యక్తిగా డాక్టర్ వైఎస్ఆర్ కి కీర్తి ఉందని ఆయన అడుగుజాడల్లో సీఎం జగన్ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ధైర్యంగా ఎదుర్కోలేక చవటల్లా దద్దమ్మల్లా వెనకనుంచి భౌతికంగా ఆయనను తొలగించాలని విజయవాడలో రాయితో దాడి చేశారని ఆరోపించారు. జగన్ కు ప్రజలు, దేవుని దీవెనలు పుష్కలంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో ఆయన అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని జోస్యం చెప్పారు. మేమంతా సిద్ధం సభ అనంతరం గుడివాడ వైయస్సార్ పార్టీ నాయకులతో సీఎం కొద్దిసేపు మాట్లాడారు. సిద్ధం సభలో మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్, మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి పెర్ని కిట్టు, పెడన అభ్యర్థి ఉప్పాల రాంప్రసాద్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక ,ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలువురు ప్రజా ప్రతినిధులు, గుడివాడ నియోజకవర్గంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధం విభాగాల నాయకులు, సీఎం జగన్ అభిమానులు, వేలాదిగా ప్రజానీకం పాల్గొన్నారు.

Read More..

సీఎం జగన్‌పై రాళ్ల దాడి..సెన్సేషనల్ కామెంట్స్ చేసిన వర్ల రామయ్య


Next Story