ఇక టీడీపీకి జనసేనే దిక్కు.. విశాఖ నుంచే పాలన : వైవీ సుబ్బారెడ్డి

by Disha Web Desk 21 |
ఇక టీడీపీకి జనసేనే దిక్కు.. విశాఖ నుంచే పాలన : వైవీ సుబ్బారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందని వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో పార్టీని నడిపించే నాయకుడు లేక దిక్కులేని స్థితికి చేరిందన్నారు. టీడీపీకి దిక్కులేకే మరో పార్టీ అధినేతపై ఆధారపడిందని విమర్శించారు. విశాఖపట్నంలో గురువారం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీని ప్రజలు ఆదరించకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి గందరగోళం నెలకొందని అయితే చంద్రబాబు అరెస్ట్‌తో ఆ పార్టీ మరింత పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిందని ఆరోపించారు. టీడీపీని నడిపించే నాయకుడు కూడా కరువు అవ్వడంతో ఇక చేసేది లేక జనసేన అధినేతపై ఆధారపడ్డారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైల్ల ఉన్నప్పటికీ ప్రజల నుంచి ఎలాంటి సానుభూతి రావడం లేదన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సానుభూతి వ్యక్తం కాకపోవడంతో బయటి రాష్ట్రాల్లో మద్దతు ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు టీడీపీ చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబును గ్లోబల్ లీడర్‌గా చూపించి సింపతీ కొట్టేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రూ.300 కోట్లు కొట్టేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును ప్రజలు విశ్వసించడం లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. మరోవైపు మూడు రాజధానుల అంశంపైనా వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని విమర్శించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ ఓటుకు నోటు కేసులో భయపడి రాష్ట్రానికి పారిపోయి వచ్చాడన్నారు. అమరావతి రాజధానిగా ప్రకటించి దాన్ని స్కామ్‌లమయం చేశారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.

విశాఖ నుంచే పాలన

విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్ సమావేశంలో స్పష్టత ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖలో కార్యాలయాలను సైతం సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా కార్యాలయాలను ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ నుంచే ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక భరోసా ఇస్తామని... వలసలు తగ్గించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇప్పటికే విశాఖ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకొచ్చారు. విశాఖను గ్రోత్ హబ్ సెంటర్‌గా కేంద్రం గుర్తించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ముందస్తు ఎన్నికలైనా, జమిలీ ఎన్నికలైనా పోటీకి తాము సంసిద్ధంగా ఉన్నామని తిరిగి అధికారంలోకి వస్తాము అని కూడా వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.



Next Story