మాట తప్పని జగన్: ఆ బాధితులకు 80% పరిహారం చెల్లింపు

by Disha Web Desk 21 |
మాట తప్పని జగన్: ఆ బాధితులకు 80% పరిహారం చెల్లింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ ఫిషింగ్‌ హార్బర్ అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న ఫిషింగ్ బోట్ల యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం పంపిణీ చేసింది. ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన 49 బోట్లకు గాను రూ.7.11 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిహారాన్ని మంత్రులు సీదిరి అప్పలరాజు,గుడివాడ అమర్నాథ్‌,రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడారు. ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన మత్స్యకారులను ప్రభుత్వం సత్వరమే ఆదుకుందని తెలిపారు. ప్రమాదం జరిగిన రెండు రోజుల్లోనే బాధితులకు పరిహారం చెక్కులను అందజేసిందన్నారు. పూర్తిగా కాలిపోయిన 30 బోట్లకు 80 శాతం పరిహారంలో భాగంగా రూ.6,44,80,000, పాక్షికంగా దగ్ధమైన 18 బోట్లు, ఒక వలకు రూ.66.96 లక్షలు పరిహారాన్ని అందించినట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. బోట్లు దగ్ధమవడంతో వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న హమాలీలు, చిరువ్యాపారులను కూడా ప్రభుత్వం గుర్తించిందని... ఒక్కో బోటుకు 10మంది చొప్పున పరిగణనలోకి తీసుకుని మొత్తం 490 మందికి ఒక్కొక్కరికీ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద రూ.10వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. మత్స్యకారులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటోందని ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా సాయం అందిస్తోందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన మత్సకారుల డీజిల్ బకాయిలు కూడా చెల్లిస్తామని.. త్వరలో ఆ బకాయిలు రూ.4 కోట్లు 15 రోజుల్లో విడుదల చేయమని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని రాష్ట్ర మత్స్యకార శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు.

ప్రమాదాన్ని రాజకీయం చేస్తారా?

విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదాన్ని కొందరు రాజకీయం చేయడానికి ప్రయత్నించారు అని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. పరిహారం ఇస్తున్న దశలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారని మండిపడ్డారు. సీఎం ఇవేం పట్టించుకోకుండా అర్హులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. రాజకీయాలు అతీతంగా విలువలో 80 శాతం చెల్లింపు చేయాలని సీఎం ఆదేశించారని..కలాసీలకు పరిహారం ఇవ్వాలని చెబితే వెంటనే పది వేలు చొప్పున ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. అలాగే ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 150 కోట్లు మంజూరు చేసిందని...స్టీల్ బోట్లు తయారీకి ఇప్పుడు 60 శాతం సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు దరఖాస్తు చేస్తే లాంగ్ లైనర్ల కోసం 75 శాతం వరకు సబ్సిడీ ఇస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు.

ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న జగన్

ఇకపోతే ఈ నెల 19న అర్ధరాత్రి విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధమవ్వగా, మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం గురించి తెలుసు­కున్న సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదే సమయంలో తానున్నానంటూ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. బాధిత మత్స్యకారులకు 80శాతం పరిహా­రం ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పినట్లుగానే ప్రమాదం జరిగిన 48గంటలు గడవక ముందే జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ అకౌంట్‌కు పరిహారం డబ్బులను సీఎం కార్యాల­యం జమ చేసింది.



Next Story

Most Viewed