JanaSena: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేనలో కలకలం

by Disha Web Desk 9 |
JanaSena: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేనలో కలకలం
X

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేనలో అలజడి మొదలైంది. సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పిఠాపురం నుంచి పవన్ చేస్తారనే సుస్పష్టమైన సంకేతాలు మొన్నటి వరకు ఉన్నాయి. వారాహి యాత్ర నేపథ్యంలో కాకినాడ సిటీ నుంచి బరిలో దిగుతారనే ప్రచారం ఊపందుకుంది. ఆ రెండు చోట్ల ఎక్కడి నుంచి పోటీ చేసినా చుట్టు ప్రక్కల నియోజకవర్గాలపై ప్రభావం చూపడం ఖాయం. అయితే, ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న వారికి అవకాశం దక్కకపోవచ్చు. ముఖ్యంగా కాపు కులాలనికి చెందిన వారైతే సీటు ఇవ్వడం మరీ కష్టంగా మారవచ్చు. ఎందుకంటే, పిఠాపురం, కాకినాడ నుంచి జనసేనాని పోటీ చేస్తే కాపుయేతరులకు సీటు ఇస్తారు. ఈ విషయమై వారాహి యాత్రలో పలువురు ఇన్‌చార్జీల్లో ఇదే విషయమై పెద్ద ఎత్తున ఆసక్తికర చర్చ మొదలైంది.

పిఠాపురం నుంచి పోటీ చేస్తే..

పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే అక్కడ పార్టీ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న పిల్లా శ్రీధర్ కు సీటు ఇవ్వకపోచ్చు. వాస్తవానికి అక్కడ వేరే ఇన్‌చార్జి ఉన్నా అవకాశం వస్తే పోటీ చేయడానికి రెడీ అని శ్రీధర్ రెడీగా ఉన్నారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఛాన్స్ ఉండకపోచ్చు. దీనిపై శ్రీధర్ మాట్లాడుతూ పోటీపై ఆసక్తి లేదని అన్నారు. జనసేన ఆశయాలు జనంలోకి తీసుకెళ్లడమే బాధ్యతగా పెట్టుకొన్నట్లు చెబుతున్నారు. కానీ, ఈయన అభిమానులు మాత్రం లోలోన మదన పడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత

భవిష్యత్‌లో ఏదో ఒక పదవి ఇచ్చే ఆయనకు అవకాశం ఉంది. అంతేగాక, పిఠాపురం నుంచి పవన్ పోటీ ప్రభావం కాకినాడ సిటీ మీద కూడా పడతుంది. సిటీ ఇన్చార్జిగా ముత్తా శశిధర్ వ్యవహరిస్తున్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయననే కొనసాగిస్తారా లేక కాపుయేతరుల్లో ఇతర బలమైన సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తారా అనేది వేచి చూడాలి..

కాకినాడ సిటీ రసవత్తరం..

కాకినాడ సిటీ నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తే కాకినాడ రూరల్, రామచంద్రపురం ముమ్మడివరం వంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా బీసీలకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. రామచంద్రపురంలో కాపు సామాజిక వర్గానికి పోలిశెట్టి చంద్రశేఖర్ గత ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేసి ఓటిమి పాలయ్యారు. నాడు సొంత సొమ్ములు చాలా ఖర్చు చేశారు. నాటి నుంచి నియోజవకర్గాన్ని అంటిబెట్టుకొని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నిత్యం జనంలో ఉంటున్నారు. పవన్ కాకినాడ పోటీతో ఇక్కడి సీటు బీసీలకు ఇస్తారనే ప్రచారం సాగుతుంది. అదే విదంగా కాకినాడ రూరల్ కూడా బీసీల పరం కానుందనే ప్రచారం జరుగుతున్నది. పంతం నాన్నాజీ ఇక్కడ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో మంచి పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇక్కడ బీసీ మహిళకు టిక్కెట్టు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక ముమ్మడివరం నియోజకర్గంలో పితాని బాలకృష్ణ ఇన్‌చార్జిగా ఉన్నారు. సీటు ఇతనికే ఇస్తారా లేక రామచంద్రపురం పంపుతారా అనేది ప్రశ్నగా మారింది.

టీడీపీతో పొత్తు ఉంటే..

జనసేనకు టీడీపీతో పొత్తు కుదిరితే సమీకరణాలు మరో రకంగా ఉండే అవకాశం ఉంది. పిఠాపురంలో మాజీ శాసన సభ్యుడు వర్మ ముందంజలో ఉన్నారు. పార్టీలో చురుకుగా ఉంటున్నారు. పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. పొత్తులో బాగంగా పిఠాపురంలో పవన్ పోటీ చేస్తే వర్మ పరిస్థితి ఏంటీ అనే ప్రశ్న వస్తుంది. కాకినాడ సిటీ విషయానికి వస్తే ఇన్‌చార్జిగా మాజీ శాసన సభ్యుడు వనమాడి వెంకటేశ్వర్ రావు ఉన్నారు. అతనికి కూడా పార్టీలో మొండి చెయ్యి చూపవచ్చనే ప్రచారం సాగుతుంది. ఏదీ ఏమైనా భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

Also Read..

మీకు నచ్చలేదని... నిజాలను అబద్దాలుగా మారుస్తారా?


Next Story

Most Viewed