షర్మిలకు పదవి... కాంగ్రెస్ ఇంచార్జి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
షర్మిలకు పదవి...  కాంగ్రెస్ ఇంచార్జి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రాష్ట్ర విభజన పుణ్యమా అని 2014, 2019లో ఒక్క చోట కూడా గెలవని ఆ పార్టీ 2024 ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో సాధించిన విజయంతో మరింత ఉత్సాహం పని చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో కూడా పాగా వేయాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా షర్మిలను ఇప్పటికే కాంగ్రెస్‌లోకి ఆహ్వానించింది. ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఆ పార్టీ హైకమాండ్ ఉంది. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో పుల్ జోష్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో సీట్లు గెలిచేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

ఇదిలా ఉంటే వైఎస్ జగన్ చేపట్టిన ఇంచార్జుల మార్పు రాష్ట్ర కాంగ్రెస్‌కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది. అసంతృప్త ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఆ పార్టీ నేతలు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ సైతం ఈసారి ఎన్నికల్లో ఏపీలో సీట్లు గెలుస్తామనే నమ్మకం పెట్టుకుంది. ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించింది. ఇవాళ పలువురు మాజీ ఎమ్మెల్యేలు విజయవాడ ఆంధ్రరాత్న భవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి రాష్ట్రంలో సిక్సర్ కొడతామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలుంటాయని పేర్కొన్నారు. ఏపీలో పార్టీని బలపరుస్తామని చెప్పారు. వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు ఇస్తామని ఖర్గే చెప్పారని మాణిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ దేశానికి ప్రధానిగా ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదని చెప్పారు. కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఏపీకి రావాల్సినవన్నీ వస్తాయన్నారు. ఏపీ ఎంపీలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాణిక్కం ఠాగూర్ మండిపడ్డారు.

Next Story

Most Viewed