అనంతకు సాగు,తాగు నీరిచ్చే బాధ్యత నేనే తీసుకుంటా : చంద్రబాబు నాయుడు

by Disha Web Desk 21 |
అనంతకు సాగు,తాగు నీరిచ్చే బాధ్యత నేనే తీసుకుంటా : చంద్రబాబు నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి అనంతపురం జిల్లాకు సాగు, తాగు నీరు అందించే బాధ్యత తాను తీసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. కళ్యాణదుర్గంలో గురువారం జరిగిన వ్యవసాయ సంక్షోభంపై ప్రజా వేదిక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చే ప్రణాళికను ఇప్పటికే తయారు చేసుకున్నట్లు వెల్లడించారు. ఇకపోతే రాయలసీమ ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలతో ఉన్న జలవివాదాలపై పోరాటం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. న్యాయమైన హక్కుల కోసం...నీటి కోసం అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రాన్ని కరువు కాటకాల నుంచి పారద్రొల్లేందుకు కేవలం గోదావరి నదుల అనుసంధానం చేయడం శాశ్వత పరిష్కారమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండర్ పేరుతో నాశనం చేశారని మండిపడ్డారు. ఈ విషయాలను ప్రజలు గమనించాలని చెప్పుకొచ్చారు. అలాగే గంగా- కావేరి నదులను సైతం అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. వైసీపీ పాలనలో రైతాంగం ఏమాత్రం లాభసాటిగా లేదన్నారు. రైతును అన్ని విధాలా వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. వైఎస్ జగన్ పాలనలో రైతులపై రాష్ట్రమంతా అరాచకాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. మరోవైపు ఇటీవల కాలంలో అంగల్లులో తనపై జరిగిన దాడి గురించి చంద్రబాబు ప్రస్తావించారు. తమపై రాళ్ల దాడికి పాల్పడి తిరిగి తమపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. చివరకు తనపై కూడా కేసులు పెట్టారన్నారు. ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంటే వైసీపీ తట్టుకోలేకపోతుందని ఆరోపించారు. ఎక్కడికక్కడ తమ పోరాటాలను అడ్డుకోవాలని చూస్తోందని.... టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతుందని చంద్రబాబు ఆరోపించారు. మరోవైపు యువగళం ప్రజాగళంగా మారిందని...ఊర్లకు ఊళ్లు తరలివచ్చి లోకేశ్‌ను సాదరంగా స్వాగతిస్తున్నారని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ సైకో సీఎం అని విమర్శించారు. జగన్ అనే దుర్మార్గుడు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపైనా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed