Guntur: ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదట...ఎస్పీ వివరణపై బీజేపీ గరం.. గరం...!

by Disha Web Desk 16 |
Guntur: ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదట...ఎస్పీ వివరణపై బీజేపీ గరం.. గరం...!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై దాడి ఘటనకు సంబంధించి పోలీస్ శాఖ వివరణ ఇచ్చింది. రాయి విసిరిన వ్యక్తి సత్యకుమార్‌పై దాడి చేయాలనే ఉద్దేశం కాదని తెలిపారు. నిరసన తెలియచేయాలనే ఉద్దేశంతోనే సీడ్ యాక్సిస్ రోడ్‌లో వెళ్తున్న కాన్వాయ్‌పై రాయివిసరడం జరిగిందని తెలిపారు. సదరు రాయి విసిరిన వ్యక్తిని సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించి, అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందని గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీజ్ వెల్లడించారు.

ఈనెల 31న మధ్యాహ్నాం రెండు గంటల సమయంలో మూడు రాజధానుల ధర్నా పాయింట్, బహుజన పరిరక్షణ సమితి ధర్నా పాయింట్ సమీపంలో బీజేపీ-వైసీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణపై ఎస్పీ ఆరిఫ్ ఆఫీజ్ ప్రకటన విడుదల చేశారు. అమరావతి ఉద్యమంలో బీజేపీనేత, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం జరిగిందని పోలీసుల విచారణలో తేలిందన్నారు. సదరు మాజీమంత్రి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారులో వెళ్తున్నారని చెప్పారు. మూడురాజధానుల ధర్నా పాయింట్ మీదుగా వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌పై ఓ వ్యక్తి రాయి విసిరాడని గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారు.

దీంతో వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగిందన్నారు. అటు వైసీపీ ఇటు బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌లో రెండు వేర్వేరు కేసులను రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. కాన్వాయ్‌పై రాయి విసిరిన వ్యక్తి దున్నా నితిన్ అలియాస్ జార్జ్‌గా గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఆరిఫ్ ఆఫీజ్ తెలిపారు.

అయితే ఎస్పీ వివరణపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ వివరణ విచిత్రంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు కాబట్టే పోలీసులు ఉదారత చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఏ పార్టీ అయినా సరే దాడులకు దిగడం సరికాదని అంటున్నారు.

Next Story

Most Viewed