53 స్థిరాస్థులు గుర్తించాం.. NRI Hospitalలో సోదాలపై ఈడీ కీలక ప్రకటన

by Disha Web Desk 16 |
53 స్థిరాస్థులు గుర్తించాం.. NRI Hospitalలో సోదాలపై ఈడీ కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపం ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఈడీ దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈనెల 2న విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్‌లో జరిపిన తనిఖీలు, సోదాలలో కొంతమేర నగదు, కీలక పత్రాలు సీజ్‌ చేసినట్లు ఈడీ వెల్లడించింది. అంతేకాదు 53 ప్రాంతాల్లో స్థిరాస్థులు ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ స్పష్టం చేసింది. మనీలాండరింగ్ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఎన్ఆర్‌ఐ సొసైటీ, వైద్య కళాశాలలో నిధుల మళ్లింపుపై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది.

ఎన్ఆర్ఐ సొసైటీకి చెందిన నిధులను భవనాల నిర్మాణాలు, ఇతర అవసరాలకు మళ్లించినట్లు విచారణలో తేలిందని ఈడీ అధికారులు తెలిపారు. కొవిడ్‌ పరిస్థితుల్లో రోగుల నుంచి భారీగా ఫీజు వసూలు చేశారని పేర్కొన్నారు. అయితే వైద్య పేరుతో వసూలు చేసిన మొత్తానికి, సంస్థ చూపిస్తున్న లెక్కలకు పొంతన లేలేదని ప్రకటనలో తెలిపారు. వైద్య విద్యార్థుల నుంచి కూడా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించామని ప్రకటించారు. ఎంబీబీఎస్‌ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ఫీజు వసూళ్లలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పారు. అకౌంట్స్ బుక్స్‌లో పేర్కొన్న గణాంకాల కంటే ప్రవేశాలకు సంబంధించిన ఫీజు అధికంగా వసూలు చేశారని పేర్కొన్నారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతా నుంచి ఎన్‌ఆర్‌ఐఏఎస్‌ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ పేరుతో ఉన్న ఖాతాకు నగదు మళ్లించినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ సోదాలలో కీలకమైన నేరారోపణ పత్రాలు, ఎలక్ట్రానిక్ డివైజెస్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.



Next Story

Most Viewed