అంతలోనే ఆవిరైన ఆనందం.. వివాదాస్పదంగా గీతాంజలి మృతి.. రాజకీయాలే కారణమా?

by Disha Web Desk 3 |
అంతలోనే ఆవిరైన ఆనందం.. వివాదాస్పదంగా గీతాంజలి మృతి.. రాజకీయాలే కారణమా?
X

దిశ వెబ్ డెస్క్: సొంత ఇల్లు ఉండాలన్నదే నా కల.. నేటితో నా కల నెరవేరిందంటూ మాట్లాడి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన గీతాంజలి అనే మహిళ చనిపోయిందంటూ అదే సోషల్ మీడియాలో వార్తలు రావడం చాల బాధాకరం అంటున్నారు నెటిజన్స్. వివరాల్లోకి వెళ్తే.. తెనాలిలోని ఇస్లాం పేటకు చెందిన గీతాంజలి దేవి (29) బాలచంద్ర దంపతులు.

వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా భర్త బాలచంద్ర బంగారం పనిచేస్తుంటారు. అయితే సొంతిల్లు లేని వారికి ఇటీవలే ప్రభుత్వం ఇంటి పట్టాలను అందించింది. ఈ నేపథ్యంలో గీతాంజలికి కూడా ప్రభుత్వం తరుపున ఇల్లు మంజూరు కాగా.. ఇటీవల తెనాలిలో వైసీపీ నిర్వహించిన సభలో గీతాంజలికి ఇంటిస్థలం పట్టా అందజేశారు.

కాగా ఆ పట్టాను అందుకున్న గీతాంజలి తన ఆనందాన్ని ఓ యూట్యూబ్ ఛానల్ తో పంచుకుంది. సొంత ఇల్లు తన కల అని.. ఆ కల ఈనాటికి నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. అలానే తన పిల్లలకు అమ్మ ఒడి అందుతుందని.. ఆ డబ్బులను పిల్లల పేరు పై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నాని పేర్కొన్నారు.

ఇక తమ మామయ్యకు పింఛన్ వస్తోంది. అత్తకు చేయూత డబ్బులు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ జగనన్న గెలవడం ఖాయం" అంటూ గీతాంజలి తన సంతోషం వ్యక్తం చేశారు. దీనితో ఆమె క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. అయితే ఆమెకు ఆ ఆనందం ఎంతో సమయం ఉండలేదు.

అనుకోని రీతిలో ఆమె రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడి మరణించినట్లు సమాచారం. అయితే ఆమె వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కాని ఆమె భర్త మాత్రం తన భార్య యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన తరువాత ఆమె పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగిందని.. దానితో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.

అయితే ఆమె మరణానికి గల అసలు కారణాలు ఏంటి అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అసలు ఆమె ట్రోలింగ్ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారా..? లేక వ్యక్తిగత కారణాలవల్ల ఆత్మహత్య చేసుకున్నారా..? అసలు ఆమెది ఆత్మహత్యేనా..? అనే అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి. ఏదిఏమైనా సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల ఒకరి ప్రాణం పోవడం విచారకరమే. గీతాంజలి మృతిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తేనే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.


Next Story

Most Viewed