శ్యామ్ చెల్లెలు బాధ్యత మాది: RAW NTR Charity

by srinivas |
శ్యామ్ చెల్లెలు బాధ్యత మాది: RAW NTR Charity
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే చేతికి అందివచ్చిన కొడుకు ఇలా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. పెళ్లీడుకు వచ్చిన కుమార్తె పరిస్థితి ఏంటని తలచుకుని విలపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో శ్యామ్ చెల్లెలి బాధ్యత తమేదనంటూ RAW NTR అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్టీఆర్ పేరిట ఆయన అభిమానులు నెలకొల్పిన ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. శ్యామ్ కుటుంబానికి అండగా ఉంటామని ‘RAW NTR’ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది.

‘పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. కానీ, శ్యామ్ కుటుంబానికి మేము అండగా నిలుస్తాం. ఇప్పటికే శ్యామ్ తల్లిదండ్రులతో మాట్లాడాం. వాళ్లకి అన్ని విధాలుగా ధైర్యాన్ని ఇచ్చాం. శ్యామ్ తన కుటుంబానికి వెన్నెముక లాంటోడు. తను లేని లోటు ఆ కుటుంబానికి మనమెవ్వరం తీర్చలేనిది. అందుచేత, శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యత మేము తీసుకున్నాం. అలాగే, జరిగిన సంఘటన మీద పోలీసు శాఖను స్పష్టమైన దర్యాప్తు చేయమని కోరుతున్నాం’ అని RAW NTR ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఇక RAW NTR స్వచ్చంద సంస్థ తీసుకున్న నిర్ణయానికి ఎన్టీఆర్ అభిమానులు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. మరోవైపు ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. అంతేకాదు స్వచ్చంధ సంస్థను ప్రసంసించారు. మరోవైపు సినీ నిర్మాత ఎస్‌కేఎన్ కూడా RAW NTR స్వచ్చంధ సంస్థను అభినందించారు. ఇకపోతే ‘RAW NTR’ అనే స్వచ్ఛంద సంస్థ 2020 నవంబర్ 23న ఏర్పడింది. 2021 జనవరి నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు మొదలుపెట్టింది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలలో ఈ సంస్థ నిత్యన్నదానంతోపాటు అనేక కార్యక్రమాలు చేస్తోంది.

Next Story