Kakinada: పవన్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ.. జనసేనలో చేరిన ప్రముఖ న్యాయవాది

by Disha Web Desk 16 |
Kakinada: పవన్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ.. జనసేనలో చేరిన ప్రముఖ న్యాయవాది
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లోకి పోరాట పటిమ, విలువలున్న వారు రావాలన్నది తన ఆకాంక్ష అని పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడకు చెందిన ప్రముఖ న్యాయవాది, కాకినాడ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ తోట సుధీర్ జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ నేరస్తులను ఎదుర్కోవాలంటే చట్టాలపై అవగాహన ఉన్న వ్యక్తుల మద్దతు అవసరమని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్లాలన్నా చట్టాలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులు కావాలన్నారు. అయితే ప్రముఖ న్యాయవాది తోట సుధీర్ లాంటివారు జనసేన పార్టీలో చేరికతో అది నెరవేరిందని చెప్పారు. చట్టాలపై అవగాహన ఉన్న వ్యక్తుల్లో తోట సుధీర్‌ ఒకరని చెప్పారు. ఆయన కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉందని, పార్టీ బలంగా ఉండాలంటే అందరి మద్దతు అవసరమన్నారు.


వచ్చే ఎన్నికల్లో కాకినాడలో జనసేన జెండా ఎగరాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రాకూడదని, అది అసాధ్యమేమీ కాదన్నారు. వైసీపీ జెండా ఎగరకూడదన్నది.. ఎవరెస్ట్ ఎక్కడం కంటే ఎంతో సులభం అని చెప్పారు. ‘వైసీపీ గెలవకూడదు అనడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వైసీపీ పాలనలో యువతకు ఉపాధి లేదు.. రైతులకు లాభం సంగతి పక్కన పెడితే కనీసం గిట్టుబాటు ధర దక్కడం లేదు. గిట్టుబాటు కల్పించకపోగా ప్రతి బస్తాకీ రూ.వంద చొప్పున దోచుకుంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు’. అని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

సగటు యువతకు ఉపాధి, రైతుకి గిట్టుబాటు ధర లాంటివి సాధించాలంటే చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తుల సమూహం అవసరం అని పవన్ వ్యాఖ్యానించారు. తోట సుధీర్ లాంటి వ్యక్తుల రాకతో పార్టీ బలంగా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాకినాడలో జనసేన జెండా ఎగరాలని, రాజకీయాల్లో అమ్ముడుపోవడం తేలిక అని. తన మటుకు తాను పుట్టిన నేల బాగుండాలని, దేశం బాగుండాలన్న కోరిక తప్ప మరే కోరికా లేదని పవన్ పేర్కొన్నారు. అడ్డదారులు తొక్కకుండా నిజాయతీగా రాజకీయాలు చేయడం చాలా కష్టమని చెప్పారు. ఆ విధంగా నిలబడ్డాం కాబట్టే ఈ రోజు ప్రతి ఒక్కరూ జనసేన వైపు వస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాది తోట సుధీర్ కుటుంబ సభ్యులు డాక్టర్ తోట అనంత లక్ష్మి, డాక్టర్ తోట కావ్య, తోట శక్తి, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, అమలాపురం ఇన్‌చార్జి శెట్టిబత్తుల రాజబాబు, కాకినాడ నగర అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed