వైఎస్ వివేకా హత్యపై డైవర్షన్ పాలిటిక్స్.. టీడీపీలోకి సునీతారెడ్డి..?

by Disha Web Desk 7 |
వైఎస్ వివేకా హత్యపై డైవర్షన్ పాలిటిక్స్.. టీడీపీలోకి సునీతారెడ్డి..?
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో కీలక నేతలను సీబీఐ విచారిస్తోంది. ఇప్పటికే పలువురిని రిమాండ్‌కు తరలించిన సీబీఐ ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారిస్తోంది. రేపో మాపో ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారంటూ వార్తలు హల్‌చల్ చేస్తుండటం సంచలనంగా మారింది. ఇదే తరుణంలో తన తండ్రిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పోరాటం చేస్తున్న వైఎస్ సునీతారెడ్డిపై పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పోస్టర్లు దర్శనమిచ్చారు.సునీతారెడ్డికి రాజకీయాల్లోకి స్వాగతం అంటూ ఈ పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ పోస్టర్లపై సోషల్ మీడియాలో ఒక మినీ వార్ నడుస్తోంది. తాము ముందే ఊహించామని వైఎస్ సునీతారెడ్డి టీడీపీలో చేరతారని అంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. వైఎస్ సునీతారెడ్డి టీడీపీలో చేరికకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదని ఈ పోస్టర్లు కుట్రపూరితంగా అతికించారని టీడీపీ చెప్తోంది.

కలకలం రేపుతున్న పోస్టర్లు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎన్నో సుడిగుండాలు ఎదుర్కొని కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చే పనిలో పడింది సీబీఐ. మరోవైపు తన తండ్రని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని హంతుకులను వదిలిపెట్టేది లేదని వివేకా తనయ వైఎస్ సునీతారెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.తండ్రి హత్యకు కారణమైనవారికి శిక్ష పడాలనే సంకల్పంతో వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి పోరాటం చేస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందుతులుగా ఉన్నది వైఎస్ కుటుంబ సభ్యులే అని వైఎస్ సునీతారెడ్డి పదేపదే ఆరోపిస్తుంది.

నిందితులు తనవారైనా శిక్ష పడాలనే ఉద్దేశంతో ఆమె పోరాడుతుంది. ఈ పోరాటం చేస్తున్న తరుణంలో ఆమెపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు చేస్తున్నారు. నారా సునీతగా మారిపోయిందంటూ విమర్శలు చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో చంపేస్తామంటూ బెదిరింపులు సైతం వచ్చినా ఆమె తొణకలేదు బెనకలేదు. కడప సిట్ నుంచి ఏకంగా సుప్రీంకోర్టు వరకు కేసును తీసుకెళ్లి న్యాయం జరిగే వరకుపోరాడుతానని భీష్మించుకు కూర్చుంది. ఇలాంటి తరుణంలో వైఎస్ సునీతారెడ్డిపై ఆసక్తికర పోస్టర్లు వెలిశాయి. రాజకీయాల్లోకి వస్తున్న వైఎస్ సునీతారెడ్డికి స్వాగతం అంటూ పోస్టర్లను అతికించారు. ప్రొద్దుటూరులోని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు వెలియడం తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఈ పోస్టర్లపై వైఎస్ వివేకానందరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, బీటెక్ రవితోపాటు పలువురు ఫోటోలు సైతం ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో పోస్టర్లు అతికించినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. సీసీ కెమెరాలు పనిచేయని ప్రదేశాలను ఎంచుకుని మరీ పోస్టర్లు అతికించారన్నారు. ఈ పోస్టర్ల ఎవరు ఏర్పాటు చేశారనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్లు అతికించిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

టీడీపీకి వైఎస్ సునీతకు ఎలాంటి సంబంధం లేదు : జీవీ ప్రవీణ్

వైఎస్ సునీతా రెడ్డి రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ వెలసిన పోస్టర్లపై ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ప్రొద్దుటూరులో వైఎస్ సునీత ఫోటోతో వచ్చిన పోస్టర్లకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఇదంతా చేస్తుందని ఆరోపించారు. వైఎస్ అవినాశ్ రెడ్డికి అటు తెలంగాణ హైకోర్టు ఇటు సుప్రీంకోర్టులలో చుక్కెదురు కావడం..త్వరలో అరెస్ట్ అవుతారంటూ వార్తలు వెలసిన నేపథ్యంలో ఇష్యూను డైవర్ట్ చేయడానికి వైసీపీ కుట్రలు చేస్తుందని అందులో భాగమే ఈ పోస్టర్లు అని తెలిపారు.

డైవర్షర్ కోసమేనా?

ఈ పోస్టర్లు కేవలం డైవర్షన్ కోసమేనని ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తోందని ఆరోపిస్తోంది. అవినాశ్ రెడ్డి అరెస్ట్‌ తథ్యమని వెల్లడించిన నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతుందని రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. తొలి నుంచి వైఎస్ సునీతారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లోనే పయనిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా వైఎస్ సునీతారెడ్డి రాజకీయ ఆరంగేట్రంకు సంబంధించి అటు చంద్రబాబు నాయుడు ఫోటో ఇటు బీటెక్ రవి ఫోటోలు వెలియడం ఖచ్చితంగా వైసీపీ పనేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీడీపీ అలర్ట్

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏదో ఒక గొడవ సృష్టించి టీడీపీ నాయకుల ఇళ్లపై, వ్యాపార సముదాయాలపై దాడులు చేసే అవకాశం ఉందని టీడీపీ చెప్తోంది.సునీత ఒకవేళ రాజకీయాల్లో చేరాలనుకుంటే.. అది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ అని స్పష్టం చేస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే పరిస్థితులు కనిపిస్తున్నాయని.. ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను టీడీపీ నేతలు కోరారు. ఇలాంటి పోస్టర్లను ప్రజలు, తెలుగుదేశం శ్రేణులతో పాటు వైసీపీ శ్రేణులు కూడా నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

రైతులను ఆదుకోండి.. సీఎస్ డా.కేఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు లేఖ

Next Story

Most Viewed