AP:ఎల్లుండే వైసీపీలోకి యనమల..? చర్చలు పూర్తి!

by Disha Web Desk 18 |
AP:ఎల్లుండే వైసీపీలోకి యనమల..? చర్చలు పూర్తి!
X

దిశ ప్రతినిధి,కాకినాడ: టీడీపీలో ముసలం పుట్టింది. యనమల సోదరుల మధ్య నెలకొన్న విభేదాలు టీడీపీ పార్టీ పై ప్రభావం చూపనున్నాయి. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న యనమల కృష్ణుడు మరో రెండు మూడు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. 2004లో తుని నుంచి అసెంబ్లీకి వెళ్లిన యనమల రామకృష్ణుడు నియోజకవర్గం కార్యకలపాలు సోదరుడుకి అప్పగించారు. తుని అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడాలనుకున్న మాజీ మంత్రి,టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు టికెట్ దక్కక పోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు.

యనమల రామకృష్ణుడు తన కుమార్తె యనమల దివ్యకు తుని అసెంబ్లీ సీటు తెచ్చుకోవడంలో సఫలమయ్యారు. గత రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తునిలో పోటీ చేసిన యనమల కృష్ణుడు రెండుసార్లు దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి పాలవటం కృష్ణుడుకు మైనస్‌గా మారింది. ఈసారి జరిగే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని లక్ష్యంతో యనమల కృష్ణుడు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న, టికెట్ దక్కలేదు. అప్పటి నుంచి కృష్ణుడు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నా కూడా యనమల రామకృష్ణుడు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. తన కుమార్తె దివ్యను ఎలాగైనా గెలిపించే చర్యల్లో భాగంగా పార్టీలోకి ఇతరులను కలుపుకుని వెళ్లే చర్యలు చేపట్టారే కానీ సొంత సోదరుడు కృష్ణుడును బుజ్జగించే చర్యలు చేపట్టలేదు.

అంతేగాక ఇతర పార్టీల నేతలను టిడిపిలోకి ఆహ్వానించే పనిలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబును కలిసి టీడీపీలో చేరాలని ఆహ్వానించడం కృష్ణుడు మింగుడు పడని అంశమైంది.నియోజకవర్గ ఇన్చార్జి మార్పు కూడా యనమల సోదరుల మధ్య వివాదాన్ని సృష్టించింది. కొంతకాలం క్రితం వైసీపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్న కృష్ణుడు పత్తిపాడు టికెట్‌ను ఆశించారు. దీనికి సీఎం జగన్ ఎటువంటి షరతులు లేకుండా పార్టీలోకి రావాలని, అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం, అదే సమయంలో చంద్రబాబు కూడా బుజ్జగించడంతో ఆ సమయంలో కృష్ణుడు కొంత వెనక్కి తగ్గారు. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ ముగియటం, ఎన్నికలు దగ్గర పడటంతో యనమల కృష్ణుడు తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

టీడీపీ అధిష్టానం కానీ, సోదరుడు యనమల రామకృష్ణుడు గాని తనను పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. తునిలో రెండు సార్లు ఓటమి పాలైన కృష్ణుడు గతంలో కూడా వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో జనసేన పార్టీలో కూడా చేరేందుకు కృష్ణుడు ప్రయత్నించారు. టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో తాను జనసేనలో చేరిన కూడా తనకు సరైన ప్రాధాన్యత లభించదనే ఆలోచనతో యనమల కృష్ణుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నెల 27న వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.



Next Story

Most Viewed