అభివృద్ధి వికేంద్రీకరణ మా అజెండా, అన్ని నగరాలను అభిృద్ధి చేస్తాం : Nara Lokesh

by Disha Web Desk 21 |
అభివృద్ధి వికేంద్రీకరణ మా అజెండా, అన్ని నగరాలను అభిృద్ధి చేస్తాం : Nara Lokesh
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధనదాహం 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసింది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అక్రమ సంపాదన కోసం లక్షలాది కార్మికుల జీవితాలను చీకటిమయం చేసిన దుర్మార్గుడు జగన్ అని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం చినఅవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ హాలు వద్ద ఏపీ భవన నిర్మాణదారులు, కార్మిక సమాఖ్య ప్రతినిధులు యువనేత లోకేశ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రతినిధులను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడారు. నిర్మాణరంగం, దాని అనుబంధ పరిశ్రమలైన స్టీలు, సిమెంటు, టైల్స్, టింబర్, వైర్లు తదితర 250రంగాలకు ఊతమిచ్చి, లక్షలాది కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది అని లోకేశ్ డిమాండ్ చేశారు. గత 51నెలల్లో ఇసుకపై జగన్ అండ్ కో రూ.10వేల కోట్లరూపాయలకు పైగా దోచుకున్నారు అని మండిపడ్డారు. జగనాసురుడి ఇసుక దాహం కారణంగా అన్నప్రాజెక్టు కొట్టుకుపోయి 61మంది అమాయకులు బలయ్యారు అని అన్నారు. పనులు కోల్పోయి రాష్ట్రంలో వందలాది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అని లోకేశ్ చెప్పుకొచ్చారు .

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి సొమ్ము స్వాహా

భవననిర్మాణ కార్మికుల సంక్షేమనిధి సొమ్ము రూ.2వేల కోట్లను జగన్ ప్రభుత్వం దొంగిలించింది అని లోకేశ్ ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలో రాగానే మెరుగైన ఇసుక పాలసీ ద్వారా నిర్మాణరంగాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తాం అని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం నిర్మాణరంగంపై అడ్డగోలుగా పెంచిన పన్నులు తగ్గిస్తామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మా అజెండా, రాష్ట్రంలోని అన్ని నగరాలను అభివృద్ధిచేస్తాం అని హామీ ఇచ్చారు. ఎక్కువమందికి ఉద్యోగాలు కల్పించే రంగాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నది మా విధానం అని లోకేశ్ చెప్పుకొచ్చారు. నిర్మాణరంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని రాయితీలు కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. బిల్డింగ్ మెటీరియల్ కాస్ట్ తగ్గించేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా గతంలో అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలను పునరుద్దరిస్తాం, ప్రమాదంలో మృతిచెందిన కార్మికులను చంద్రన్న బీమా ద్వారా ఆదుకుంటాం అన్నారు. నాలుగేళ్ల విధ్వంసక పాలనలో ఛిద్రమైన నిర్మాణరంగానికి పరిశ్రమ హోదా కల్పించి మళ్లీ గత వైభవం తెస్తాం అని లోకేశ్ హామీ ఇచ్చారు.

Read More : నారా లోకేశ్‌పై డీజీపీకి పోసాని ఫిర్యాదు.. ఇక ఆయనే చూసుకుంటారని హెచ్చరిక


Next Story

Most Viewed