YSRCP : సీఎం సొంత జిల్లాలో సఖ్యత ఎండమావేనా!

by Disha Web Desk 7 |
YSRCP : సీఎం సొంత జిల్లాలో సఖ్యత ఎండమావేనా!
X

దిశ ప్రతినిధి, కడప: అంతా బాగుంది.. వర్గ పోరు ప్రతిపక్ష తెలుగుదేశంలోనే.. మా వాళ్ళంతా కలిసి కట్టుగా ఉన్నారు అనుకుంటూ వచ్చిన వైసీపీలో ఇప్పుడు అలాంటి వర్గ పోరే ఆ పార్టీలో గుబులు రేపుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి కుంపట్లు బహిర్గతం కాక పోయినా లోపల రగులుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అంతా తానై నడిపిస్తున్నందున ఎవరూ బహిరంగంగా నోరు మెదిపి విమర్శించుకోకపోయినా, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోకపోయినా కడుపులో కత్తులు పెట్టుకుని బయటకు కాలం గడుపుతున్నారు.

అసెంబ్లీ స్థాయి నేతల మధ్య అసమ్మతి తూటాలు పేలక పోయినా అనుచరులు మాత్రం బహిర్గతమవుతున్నారు. ఎమ్మెల్యేకు నియోజకవర్గ నేతలకు కొన్ని చోట్ల అస్సలు పడటం లేదు. ఎదురుపడ్డ మాట్లాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరికొన్ని చోట్ల అనుచరుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాలు అయితే సైలెంట్‌గా ఉంటూనే అనుచరులతో పనులు, ఇసుక, గ్రావెల్ వ్యవహారాల్లో ఫిర్యాదులు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఎన్నికల వేళ.. అసమ్మతి గళం

సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి. అందునా సొంత జిల్లాలో ప్రతిష్ట ఏమాత్రం తగ్గకూడదన్న తలంపుతో ఉన్నారు. ఇందుకోసం ఆయన జిల్లాకు ఏదో ఒక రకమైన లబ్ధి చేకూరుస్తూనే ఉన్నారు. అయితే నేతల్లో మాత్రం అలాంటి పట్టుదల కనిపించడం లేదు. మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి, వైసీపీకి జమ్మలమడుగు నియోజకవర్గంలో అండదండలు అందిస్తున్నారు.

ప్రతిష్టాత్మకం...

ఆ నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే అక్కడ ఈసారి తెలుగుదేశం పార్టీ గట్టిగా బరిలో ఉండే పరిస్థితులు కనిపిస్తుండడంతో జగన్మోహన్‌రెడ్డి అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు. అయినా కూడా అక్కడ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఏమాత్రం సఖ్యతగా లేరు. వారి వర్గాలు కలిసే పరిస్థితుల్లో కనిపించడం లేదు. వర్గీయులు ఒక రెండు సార్లు గొడవలకు కూడా దిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలు కలిసి పెద్దగా కార్యక్రమాలు కూడా నిర్వహించిన పరిస్థితులు లేవు.

ప్రొద్దుటూరులోనూ...

దాని పక్కనే ఉన్న ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌ల మధ్య సఖ్యత కొరవడింది. వారిద్దరు కూడా ఐక్యంగా పనిచేసే వాతావరణం కనిపించడం లేదు. ముఖ్యనేతల మధ్య విభేదాలు పార్టీపై ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయన్న ఆందోళన ఆ పార్టీ వర్గీయుల్లోనే వ్యక్తం అవుతుంది. కమలాపురం నియోజకవర్గంలో జగన్ మేనమామ ఎమ్మెల్యేగా ఉన్నారు.

బాబాయి మల్లికార్జున్‌రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్నారు. ఇద్దరు కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా లోపల మాత్రం వీరిద్దరి మధ్య సఖ్యత లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరువురు వర్గీయులు పనులు విషయంలో విభేదాలకు దిగుతున్నట్లు సమాచారం. ఇటీవల పెండ్లిమర్రి, వియన్ పల్లె మండల నేతలు కొందరు అసమ్మతి సమావేశాలు కూడా నిర్వహించడం వారిని ఎమ్మెల్యే బుజ్జగించుకోవడం జరిగిందని సమాచారం.

కడపలో మరో సమస్య...

కడప అసెంబ్లీ నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు లేకపోయినా ఈసారి టికెట్లు ఆశించే వారి సంఖ్య పెరగడంతో టిక్కెట్ దక్కని ఈ ఆశావహులు ఎలాంటి వైఖరి అవలంబిస్తారో అన్నది సందేహంగా మారుతోంది. బద్వేల్ నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డికి ఆయన బావమరిది విశ్వనాథరెడ్డి లకే కుదరడం లేదు. మరికొందరు నాయకులు కూడా ఎమ్మెల్సీపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. రాజంపేట అసెంబ్లీలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి జడ్పీ చైర్మన్ అమర్నాథరెడ్డిలు కలిసి ఉన్నట్లు అనిపించినా లోపల మాత్రం విభేదాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. ఇటీవల అక్కడ ఎమ్మెల్యేపై వేసిన కొన్ని పోస్టర్లు వీరిద్దరి మధ్య విభేదాల కారణంగానే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అవినాశ్‌పైనా గుర్రు...

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కడప జిల్లాలో జగన్ తర్వాత అంతా తానుగా వ్యవహరిస్తున్నారు. అయితే అంతవరకు బాగా ఉన్నా చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా పోస్టింగులు వేయించడం, పనులు విషయంలోనూ ఎమ్మెల్యేకు తెలియకుండానే నేరుగా కొందరు ఎంపీ దగ్గరకు వచ్చి పనులు చేసుకోవడం లాంటివి వాటి కారణంగా ఎమ్మెల్యేలు అసంతృప్తిని చవి చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా అధికారులు కూడా చాలామటుకు ఎంపీకే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోందన్న అభిప్రాయాలూ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

అయితే ఎంపీని కాదని మాట్లాడే పరిస్థితి ఎవరికీ లేదు కాబట్టి లోలోపల కొందరు ఎమ్మెల్యేలు అంతర్మథనానికి గురవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇలా ఎమ్మెల్యేలు కొందరు అసంతృప్తితో ఉండడం, ఎమ్మెల్యేలతో సమాంతర నాయకులు సఖ్యతతో లేక పోవడం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తలభారంగా మారే పరిస్థితులు ఎదురు కానున్నాయి. మరి సొంత జిల్లాలో నేతల మధ్య నలుగుతున్న అసమ్మతి పోరును సద్దుమణిగేందుకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలి.





Next Story

Most Viewed