పొత్తులో రాజుకున్న పోరు.. ఏకపక్షంగా సీట్ల పంపకం.. అసలేం జరిగింది..?

by Disha Web Desk 3 |
పొత్తులో రాజుకున్న పోరు.. ఏకపక్షంగా సీట్ల పంపకం.. అసలేం జరిగింది..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉందని.. అధికార పార్టీ అసమర్ధ పాలన నుండి ప్రజలను విముక్తుల్నిచెయ్యడమే లక్ష్యంగా జనసేన పార్టీ కృషి చేస్తుందని పవన్ కళ్యాణ్ గతంలో తెలిపారు . అయితే ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అరాచక పాలనను అంతమొందించడానికి.. రామరాజ్యాన్ని తిరిగి తీసుకు రావడానికి టీడీపీతో జనసేన పొత్తు కలుపుకుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇరు పార్టీల అధినేతలు సొంత అన్నదమ్ముల్లా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.

రానున్న ఎన్నికల్లో విజయభేరిని మోగించి టీడీపీ, జనసేన జెండాలను రెపరెపలాడించాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహ రచన చేశారు. ఎక్కడికి వెళ్లిన రామలక్ష్మణుల్లా జంటగా వెళ్ళే వాళ్ళు. అయితే ఈ పొత్తులో పోరు మొదలయింది. ఆస్తి పంపకాల్లో అన్నదమ్ముల మధ్య అరమరికలు వచ్చినట్లు.. సీట్ల పంపకాల్లో టీడీపీ, జనసేన మధ్య అగ్గి రాజుకుంది.

నిన్న చంద్రబాబు అరకు, మండపేట నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు జనసేన అధినేతకుగాని, ఆ పార్టీ ఇతర నేతలకు గాని సమాచారం ఇవ్వలేదు. దీనితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ పై ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ వాళ్ళు ఏకపక్షంగా అభయార్థులను ప్రకటించకూడదని.. కానీ టీడీపీ అధిష్టానం ధర్మం తప్పి అరకు, మండపేట రెండు సీట్లను పరకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నేతలు తన దగ్గరకి వచ్చి మండపేట నియోజకవర్గ అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారని.. కనీసం జనసేనకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ఎలా చేస్తారని బాధపడినట్లు పేర్కొన్నారు.

ఇక గత ఎన్నికల్లోనే మండపేటలో జనసేనకు 18 శాతం ఓటు ఉందని.. ప్రస్తుతం 10 శాతం ఓటింగ్ ఆ నియోజకవర్గంలో పెరిగిందని.. అలాంటి నియోజకవర్గంలో చంద్రబాబు చెప్పకుండా సీట్లు కేటాయించడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పొత్తు ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ముగియదని స్పష్టం చేశారు. అలానే టీడీపీ రెండు సీట్లను ప్రకటించింది కనుక తాము రెండు సీట్లను ప్రకటిస్తున్నామని తెలిపిన ఆయన.. రాజోలు, రాజానగరం సీట్లను ప్రకటించారు.

చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నప్పుడు తనకు ఒత్తిడి ఉంటుందని చంద్రబాబును ఎద్దేవ చేసారు. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున ఆర్ అక్షరం బాగుంటుందనిపించిందని.. అందుకే రాజోలు, రాజానగరం రెండు సీట్లను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన టీడీపీ జనసేన పొత్తుల రాజకీయం మూడునాళ్ళ ముచ్చటగా ముగియనుందా అనే సందేహాన్ని అటు రాజకీవర్గాల్లోనూ ఇటు ప్రజల్లోనూ కలిగిస్తోంది.

Next Story

Most Viewed