Tirupati: శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలపై ఈవో కీలక ప్రకటన

by Disha Web Desk 16 |
Tirupati: శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలపై ఈవో కీలక ప్రకటన
X

దిశ, తిరుమల: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 18 నుంచి 26 వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబ‌రు 22న గ‌రుడ‌సేవ‌కు విశేషంగా విచ్చేసే భ‌క్తులంద‌రూ సంతృప్తిక‌రంగా వాహ‌న‌సేవను ద‌ర్శించుకునేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్ల‌ను అధికారుల‌తో క‌లిసి ఈవో ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబ‌రు 18న ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని తెలిపారు. గ‌రుడ‌సేవ నాడు దాదాపు 2 ల‌క్ష‌ల మంది భ‌క్తులు గ్యాల‌రీల్లో వేచి ఉంటార‌ని చెప్పారు. గ‌రుడ సేవ ద‌ర్శ‌నం కోసం ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, ఔట‌ర్ రింగ్ రోడ్ల‌లో వేచి ఉండే భ‌క్తుల‌ను సుప‌థం, సౌత్ వెస్ట్ కార్న‌ర్‌, గోవింద‌నిల‌యం నార్త్ వెస్ట్ గేట్‌, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాల‌రీల్లోకి అనుమ‌తిస్తామ‌ని ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి వెల్ల‌డించారు.

గ‌రుడ వాహ‌నాన్ని రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభించి భ‌క్తులంద‌రూ ద‌ర్శించుకునేలా అర్ధ‌రాత్రి 2 గంట‌ల వ‌ర‌కైనా నెమ్మ‌దిగా ముందుకు తీసుకెళ‌తామ‌ని ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి తెలియ‌జేశారు. బ‌య‌ట వేచి ఉండే భ‌క్తులు త‌మ వంతు వ‌చ్చే వ‌ర‌కు సంయ‌మ‌నంతో వేచి ఉండి భ‌ద్ర‌తా విభాగం నిబంధ‌న‌లు పాటించాల‌న్నారు. అంద‌రికీ గ‌రుడ‌సేవ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం, బ‌స‌, భ‌ద్ర‌త‌, పారిశుద్ధ్యం త‌దిత‌ర ఏర్పాట్ల‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేప‌ట్టిన‌ట్టు ఈవో పేర్కొన్నారు. భ‌ద్ర‌తాచ‌ర్య‌ల‌పై ఇదివ‌ర‌కే సీవీఎస్వో, తిరుప‌తి ఎస్పీ స‌మీక్ష నిర్వ‌హించారని టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి చెప్పారు.

Next Story