TDP: కుప్పం మేనిఫెస్టో విడుదల.. చంద్రబాబు సంచలన హామీలు

by Disha Web Desk 16 |
TDP: కుప్పం మేనిఫెస్టో విడుదల.. చంద్రబాబు సంచలన హామీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘సంపద సృష్టించటం, ఆ సంపదను పేదలకు పంచడం తెలిసిన పార్టీ టీడీపీ. రూ.2కే కిలో బియ్యం, పక్కా ఇళ్ల నిర్మాణం, జనతా వస్త్రాలు వంటి సంక్షేమ పథకాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం. ఐటీనీ అందిపుచ్చుకుని సంపద సృష్టించాం.’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా డీసీసీ అధ్యక్షుడు సురేశ్‌తో పాటు ఆయన అనుచరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. కుప్పం నియోజకవర్గంలో ప్రతీ టీడీపీ కార్యకర్త లక్షమెజారిటీ వచ్చేలా పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తమకు సంపద సృష్టించడం..చరిత్ర సృష్టించడం తెలుసునని చెప్పారు. టీడీపీ పెట్టినప్పటి నుంచి కుప్పంలో టీడీపీ జెండా ఎగురుతూనే ఉందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కావాలన్నా, పిల్లలు భవిష్యత్ బాగుండాలన్నా టీడీపీనే గెలవాలని చంద్రబాబు సూచించారు.


రాష్ట్రంలో కుప్పం నియోజకర్గం అంటే ఒక గౌరవం ఉందని దాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు అన్నారు. టీడీపీలో చేరిన డా.సురేశ్ తండ్రి దొరస్వామి తాను ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టినట్లు ఆయన గుర్తు చేశారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. నీతి నిజాయితీకి మారు పేరు కుప్పం ప్రజలన్నారు. కాని నేడు రౌడీలు పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు. తన దగ్గర రౌడీయిజం చెల్లదని వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర వాదులపై పోరాడిన పార్టీ, రౌడీలను తుదముట్టించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. కుప్పంలో వైసీపీ గూండాలు బహిరంగా ఒక వ్యక్తిపై దాడులు చేయటాన్ని వీడియోలో చూసి చలించిపోయానన్నారు. అసలు వాళ్లు మనుషులా, రాక్షసులా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదలను ధనికులను చేస్తాం

పేదలను ధనికుల్ని చేసే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నాడు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్‌లు ఇచ్చామని గుర్తు చేశారు. కాలేజీ సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి మగవారితో సమానంగా ప్రోత్సహించామని ఆయన తెలిపారు. ఆడబిడ్డల్ని మహాశక్తిగా రూపొందిచేందుకు ‘మహాశక్తి’ పథకం తెచ్చామని చంద్రబాబు తెలిపారు. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మినీ మేనిఫెస్టో ప్రకటించారు. 18- నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది చదువకునే పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం కింద ఏడాదికి రూ. 15 వేలిస్తామని చంద్రబాబు హామీలిచ్చారు. యువతకు రూ.3వేల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. రైతులకు ఏడాదికి రూ. 20 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పారు. కుళాయి ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామన్నారు. ఇక్కడ 95 శాతం పూర్తైన హంద్రీనీవా పూర్తి చేయలేకపోయారని, తానుంటే 3 ఏళ్లలోనే పూర్తి చేసి నీళ్లిచ్చేవాడినని తెలిపారు. ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఉద్యోగులు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మళ్లీ టీడీపీ గెలవాలని చంద్రబాబు సూచించారు. గత 35 ఏళ్లలో నియెజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వచ్చే 5 ఏళ్లలో చేసి చూపిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

ఆ పనులు నేను సినిమాల్లోనే చేయను.. ఇక ఇక్కడెందుకు చేస్తా: పవన్ కల్యాణ్



Next Story