Nara Lokesh Challenge: సీమకు ఏమి చేసావో చెప్పు జగన్?

by Disha Web Desk 16 |
Nara Lokesh Challenge: సీమకు ఏమి చేసావో చెప్పు జగన్?
X

దిశ, తిరుపతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 21వ రోజు కొనసాగుతోంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలం, రాజులకండ్రిగలో రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు. 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అంటూ సీఎం జగన్ రాష్ట్రాన్ని రైతు లేని రాజ్యంగా తయారు చేశారని లోకేశ్ మండిపడ్డారు.

రైతులను దగా చేసిన జగన్ ప్రభుత్వం

రుణమాఫీ, సబ్సిడీ రుణాలు, గిట్టుబాటు ధర, భూసార పరీక్షలు లేకుండా జగన్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని లోకేష్ ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. రాయలసీమలో వ్యవసాయ రంగాన్ని నీరుగార్చారని, సీమపై ప్రేమ లేని జగన్ రెడ్డి రాయలసీమలో ఎలా పుట్టారని అన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత టీడీపీ ప్రభుత్వందేనని లోకేష్ వ్యాఖ్యానించారు.

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిపై లోకేష్ కామెంట్స్ ...

కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారని, ఎవరైనా దొంగతనం చేసి కోర్టుకు వెళ్తారని.. ఈ మంత్రి కోర్టులోనే దొంగతనం చేశారని నారా లోకేష్ అన్నారు. దొంగ.. వ్యవసాయ శాఖ మంత్రి అయితే రైతుల పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. ఇప్పుడు మంత్రి కాకాణీకి సీబీఐ 'రా' అని పిలుస్తోందన్నారు. రాష్ట్రంలో పరిపాలన దరిద్రంగా ఉందని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు. సైకో పరిపాలను తరిమికొట్టాలంటే కలిసికట్టుగా పోరాడుదామని పిలుపిచ్చారు. సైకో రాజ్యంలో దుబారా ఖర్చులు పెరిగి రైతులపై భారం పడిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed