Palamaneru: పాపం ఏనుగులు.. మనుషులు కూడా ఇలా చేయరేమో..!

by Disha Web Desk 16 |
Palamaneru: పాపం ఏనుగులు.. మనుషులు కూడా ఇలా చేయరేమో..!
X

దిశ, పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ నెల 14న మూడు ఏనుగులు రోడ్డు దాటుతుండగా కూరగాయల వాహనం ఢీ కొనడంతో అవి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అటవీ శాఖ అధికారులు వాటిని రహదారికి దగ్గర్లోనే ఖననం చేశారు. అయితే ఆ చోటుకు ఏనుగుల గుంపులు రావడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. రాత్రి నుంచి వేకువ జాము వరకు ఓ ఏనుగుల గుంపు అక్కడే సంచరిస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఏనుగులు.. పంట పొలాలు దాటి మూడు ఏనుగులను ఖననం చేసిన ప్రాంతానికి చేరుకుని ఘీంకారాలు చేశాయి. అక్కడే చాలాసేపు నిలబడి చూస్తూ ఉండిపోయాయి.

అయితే ఈ విషయం గుర్తించిన పలువురు స్థానికులు భయపడుతూనే వీడియోలు తీశారు. అనంతరం ఇదే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పి వీడియోను చూపించారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు సంఘటన స్ధలానికి చేరుకుని ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. ఏనుగులు సంచరించిన పాద ముద్రలను కనుకొన్నారు. తోటి ఏనుగులు మృతిని జీర్ణించుకోని ఏనుగులు వాటిని ఖననం చేసిన ప్రదేశానికి చేరుకుని గంటల తరబడి అక్కడే ఉండడం చూపరులను కలిచి వేసింది.

Next Story

Most Viewed