Chittoor: నకిలీ హోంగార్డులకు కోట్లలో చెల్లింపులు.. కేసు నమోదు

by Disha Web Desk 16 |
Chittoor: నకిలీ హోంగార్డులకు కోట్లలో చెల్లింపులు.. కేసు నమోదు
X

దిశ, తిరుపతి: చిత్తూరు జిల్లాలో వెలుగు చూసిన నకిలీ హోంగార్డుల వ్యవహారంలో బాధ్యులపై పోలీస్ కేసులు నమోదు చేయాలంటూ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మొత్తం 93 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో నకిలీ హోంగార్డులు 90 మందితో పాటు ఇద్దరు హోంగార్డులు, ఒక కానిస్టేబుల్‌ ఉన్నారు. చిత్తూరు జిల్లా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో వెలుగు చూసిన నకిలీ హోంగార్డుల నియామకంపై నమోదైన కేసును అవినీతి నిరోధక శాఖకు బదిలీ చేశారు. కేసును పోలీసు శాఖ నుంచి ఏసీబీకి బదిలీ చేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడుగురు నిందితులుగా ఉన్న ఈ కేసులో ఇప్పుడు మరో 86 మందిని చేర్చారు. మొత్తం నిందితులు 93 మందిలో, నకిలీ హోంగార్డులు 90 మంది, విధుల నుంచి తొలగించిన హోంగార్డులు ఇద్దరు, ఒక కానిస్టేబుల్‌ ఉన్నారు. నకిలీ హోంగార్డుల కేసును ఏసీబీ చేపట్టడంతో అక్రమాలకు పాల్పడిన వారిలో వణుకు మొదలైంది.

నకిలీ హోంగార్డుల నుంచి టీడీపీ నేతలు డబ్బులు వసూలు చేసి అందులో భారీ మొత్తాన్ని నాటి ప్రభుత్వంలో కీలక నేతలకు అప్పచెప్పారనే అనుమానాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు హోంగార్డు ఉద్యోగాలను అమ్మిన డబ్బులో వాటాను ముఖ్య నాయకులకు పంపినట్లు అనుమానిస్తున్నారు. ఈ కుంభకోణంలో చిత్తూరులో పని చేసిన డీఎస్పీలు, జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో పని చేసే ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు, ఓ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో సాక్ష్యాలు సేకరిస్తున్నారు.

అక్రమ నియామకాలకు అధికారుల మద్దతు..

2014 నుంచి 2019 వరకు చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో 90 మంది హోంగార్డులను చేర్చారు. పోలీసుశాఖ నుంచి నోటిఫికేషన్‌ లేకుండా, దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించకుండానే కొందరు పోలీసు అధికారులు, తెలుగుదేశం నేతలు కలిసి వీరిని ఉద్యోగాల్లో చేర్పించేశారు. ఇలా ఉద్యోగాలు పొందడానికి ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసు శాఖలో పెద్ద హోదాల్లో పని చేసిన అధికారులు ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ హోంగార్డులను ఆన్‌-పేమెంట్‌ కింద టీటీడీ, అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖ, విద్యుత్‌శాఖ, రవాణాశాఖ, లా అండ్‌ ఆర్డర్‌ విభాగాల్లో విధులకు కేటాయించారు. అక్రమ పద్ధతుల్లో, తప్పుడు డ్యూటీ ఆర్డర్‌‌లతో పోస్టులు పొందిన నకిలీ హోంగార్డులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.12 కోట్లకుపైగా వేతనాలు కూడా చెల్లించింది.

ఈ వ్యవహారాన్ని ఆలస్యంగా గుర్తించిన చిత్తూరు జిల్లా పోలీసుశాఖ గతేడాది జూలై 16న రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు డిసెంబర్‌ 11న ఏడుగురిని అరెస్టు చేశారు. విధుల నుంచి తొలగించిన వారిలో హోంగార్డులు ఇద్దరు, ఒక కానిస్టేబుల్‌ను కూడా ఉన్నారు. రూ.కోట్లు చేతులు మారడం, పోలీసుశాఖలోని ఉద్యోగుల ప్రమేయం ఉండటంతో డీజీపీ ఈ కేసును ఏసీబీకి బదిలీ చేసినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed