CPI: అది సమావేశమా... కార్యక్రమమా.. మోడీ క్షమాపణ చెప్పాలి?

by Disha Web Desk 16 |
CPI: అది సమావేశమా... కార్యక్రమమా.. మోడీ క్షమాపణ చెప్పాలి?
X

దిశ, తిరుపతి: హైదరాబాద్‌లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, వందే భారత్ రైలును ప్రారంభించిన నరేంద్ర మోడీ టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడం రాజ్యాంగ లౌకిక వ్యవస్థకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ మండిపడ్డారు. తక్షణం నరేంద్ర మోడీ జాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కోసం సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి హోదాలో వచ్చిన మోడీ బీజేపీ సమావేశంగా మార్చడం సిగ్గుచేటు అని విమర్శించారు. బీజేపీ నేతగా సమావేశానికి వచ్చారా లేక ప్రధానిగా వచ్చారా సమాధానం చెప్పాలన్నారు. మోడీ ప్రసంగం మొత్తం తెలంగాణ ప్రభుత్వంపై దాడి చేసేలా సాగిందన్నారు. కేసీఆర్ బీజేపీకి అనుకూలంగా ఉన్న రోజుల్లో అవినీతి ఎందుకు కనబడలేదని, నేడు ఎందుకు తెరమీదకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. తనకు జై కొట్టిన వారిని ఇళ్లకు పంపుతారని, జై కొట్టని వారిని జైలుకు పంపడం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసే కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే తమిళనాడులో కుల ప్రస్తావనలను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా పక్షపాత ధోరణి అవలంబిస్తుందని చెప్పారు. ప్రజల నుంచి జీఎస్టీ రూపంలో వసూలు చేసిన డబ్బులు మోడీ ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు.

జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ రాగానే రాహుల్ గాంధీపై రాజకీయ శిక్ష వేశారని నారాయణ పేర్కొన్నారు. ప్రజాధనంతో రైల్వేలకు ఖర్చు చేస్తున్నారని, అందులో భాగంగానే వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారని చెప్పారు. వందే భారత్ రైళ్ల చార్జీలు విమాన చార్జీలను తలపిస్తున్నాయని అన్నారు. త్వరలో వీటిని ప్రైవేట్ వ్యక్తులకు మోడీ అప్పగిస్తారని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ తీరును ఎండగడతో 19 రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావడం జరిగిందని ప్రజాక్షేత్రంలో మోడీని ముద్దాయిగా నిలబడతామని నారాయణ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం ఆర్థిక నేరగాళ్లకు నిలయంగా మారిందన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు వేరే వాటికి జగన్ మళ్లిస్తుంటే ఉండవల్లి ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed