Chandrababu, Lokesh నిర్ణయంతో డైలమాలో పడిన సీనియర్లు

by Disha Web Desk 16 |
Chandrababu, Lokesh నిర్ణయంతో డైలమాలో పడిన సీనియర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతోందా..? ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, యువగళం పాదయాత్రలు పార్టీ బలోపేతానికి బూస్ట్ ఇచ్చాయా? వైసీపీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో టీడీపీ సక్సెస్ అయ్యిందా? అంటే అవుననే సమాధానం చెప్తున్నారు తెలుగు దేశం పార్టీ శ్రేణులు. 2022 ఏడాది నవంబర్ వరకు టీడీపీ పరిస్థితి రాష్ట్రంలో అగమ్య గోచరంగా ఉండేది. కనీసం నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలు సైతం కరువయ్యారు. కనీసం పార్టీ ఏ పిలుపు నిర్వహించినా కనీసం జెండా పట్టుకుని నిలిచే వారే కానరాకుండా పోయారు. అయితే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు వంటి వినూత్న కార్యక్రమాలతో టీడీపీ ప్రజల్లోకి వెళ్లడంతో అమాంతం గ్రాఫ్ పెరిగిందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా టీడీపీ టార్గెట్ చేసిందని అది సక్సెస్ దిశగా పయనిస్తోందని తెలుస్తోంది. టీడీపీకి యువత దగ్గరవుతున్నారని.. యువగళం పాదయాత్రలో కూడా కనిపించేది యువతేనని టీడీపీ చెప్పుకొస్తోంది. ఇదే తరుణంలో టీడీపీలో యువతకు 40 శాతం టికెట్లు ఇస్తామని టీడీపీ ప్రకటించేసింది. దీంతో యువత టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తు్న్నట్లు తెలుస్తోంది.

తొలగిన నైరాశ్యం

తెలుగుదేశం పార్టీలో నెలకొన్న నైరాశ్యం ఇప్పడిప్పుడే నెమ్మదిగా పోతుంది. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి పార్టీ కార్యకర్తలు తేరుకున్నారు. పార్టీలోనూ.. కార్యకర్తల్లోనూ నెలకొన్న నైరాశ్యాన్ని తగ్గించేందుకు చంద్రబాబు, లోకేశ్‌లు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల భయంతో టీడీపీ శ్రేణులు కానీ నాయకులు కానీ రోడ్డెక్కలేదు. దీంతో వైసీపీకి తిరుగే లేదని ఆ పార్టీ చెప్పుకుంటోంది. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా టీడీపీ గ్రాఫ్ పెరిగిపోయింది. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ అటు లోకేశ్, ఇటు చంద్రబాబులు వైసీపీని ఓ ఆట ఆడేసుకున్నారు. మూడున్నరేళ్లపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా పరిశీలించిన చంద్రబాబు యువత నైరాశ్యంలో ఉన్నారని గ్రహించారు. అంతే యువతను ఆకట్టుకునేందుకు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకేనని ప్రకటించేశారు. దీంతో యువత చాలా యాక్టివ్ అయ్యారు. కేసులు, వేధింపులను సైతం పక్కన పెట్టేశారు. పెట్టుకుంటే పెట్టుకోండి అన్నట్లు రోడ్డెక్కి టీడీపీ జెండా పట్టుకుని నిలబడుతున్నారు. దీంతో టీడీపీలో నెలకొన్న నిస్తేజం దాదాపు తొలగినట్లేనని ఆ పార్టీ చెప్తోంది.

టికెట్ల కోసం యువత కుస్తీ

2024 ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు అని అటు చంద్రబాబు ఇటు లోకేశ్‌లు బహిరంగ ప్రకటన చేయడంతో యువత దూకుడు పెంచారు. తండ్రులు సీనియర్లు అయితే కొడుకులను రంగంలోకి దింపి తెరవెనుక తతంగం నడిపిస్తున్నారు. మరికొందరు యువ నేతలు అయితే అటు చంద్రబాబు, ఇటు లోకేశ్‌లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా యువగళం లోకేశ్ పాదయాత్రలో యువత హల్ చల్ చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర కావడంతో టిక్కెట్ ఖరారు చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు అప్పుడే మొదలు పెట్టేశారు. దాదాపు ఏడాది సమయం ఉండగానే యువత టికెట్ల కోసం కుస్తీ పడుతున్నారు. ఇప్పటికే టీడీపీ అధిష్టానం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మిగిలిన నియోజకవర్గాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు యువత పోటీ పడుతున్నారు. దీంతో ప్రతి నియోజకవర్గంలో నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొందని తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు నుంచి నలుగురు ఆశావహులు టికెట్ రేసులో ఉన్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు యువత తమ తమ నియోజకవర్గాల్లో తమదైన శైలిలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతూ అధిష్టానం మెప్పు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి సేవలను గుర్తిస్తు్న్న పార్టీ నాయకత్వం వారిలో మరింత జోష్ నింపేలా ప్రకటనలు చేస్తోందట. మెుత్తానికి టీడీపీ యువతలో మాత్రం జోష్ మామూలుగా లేదని ఎన్నికలు వచ్చేసరికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Next Story

Most Viewed